అధ్యాయం - 9
దక్కన్ పై మొఘలుల దండయాత్రలు
(Mughal Invasions of the Deccan)
దక్కన్ సుల్తాన్ లకు (Sultanates) దక్షిణాన వున్న విజయనగరం పోరు తప్పిన వెనువెంటనే ఉత్తర భూభాగం నుండి పుట్టుకొచ్చిన కొత్తశక్తి తలనొప్పిగా మారింది. విజయనగరం పతనావస్థకు చేరిన సమయంలోనే మహాబలియైన అక్బర్ నాయకత్వంలో మొఘల్లు కొత్తశక్తిగా ఉద్భవించి, సరిగ్గా విజయనగరాన్ని గత చరిత్రలోకి నెట్టివేసిన తాళికోట యుద్ధ సమయానికి మొఘల్లు మాల్వాను వశపరుచుకున్నారు. 1565 A.D.లో మాల్యాపై విజయం మొఘల్ సామ్రాజ్యానికి, దక్కన్ రాజ్యాల దగ్గరికి అనగా సరిహద్దులవరకు వచ్చే అవకాశాన్ని కలిగించి, మొఘల్ చక్రవర్తులదృష్టిని ఆకర్షించింది. ఐనప్పటికీ దక్కన్ రాజ్యాలపై విజయకాంక్ష 1595 A.D. ముందు వరకు మొఘలులకు ఉత్తర భూభాగంపై వున్న ఇతర అత్యవసర సమస్యలను పరిష్కరించుకునే దశలో వుండటం వలన ఫలవంతం కాలేదు. ఉత్తరాది భూభాగాలపై జైత్రయాత్ర తన ఆకాంక్షలమేరకు ముగిసిన వెంటనే దృష్టి, దక్షిణపథాన మళ్ళి దక్కన్ రాజ్యాల స్వాధీనత పై ప్రణాళికలను సిద్ధం చేయ నిశ్చయించాడు. భౌగోళికంగా మాల్వా, అహ్మద్ నగర్ రాజ్యానికి దగ్గరగా ఆనుకుని వుండటం వలన మొఘలుల ప్రధాన లక్ష్యంగా మారడం ఈ రాజ్యానికి దురదృష్టకరమైంది. ఇది వరకే రాజ్యంలో అంత కల్లోలాలతో సతమతమవుతున్న అహ్మద్ నగర్ కు 'గోరుచుట్టూ రోకటి పోటు' లా మొఘలులు పథకం మారింది. 1565 లో హుసేన్ నిజాం షా-1 కుమారుడు ముర్తుజా నిజాం షా- రాజ్య భారాన్ని స్వీకరించిన తదుపరి అతని చిత్త చాంచల్యం, అతిగా ప్రవర్తించే తీరు, మతి తప్పిన చేష్టలు నిజాం షాహి సల్తనేట్ ప్రతిష్టను దిగజార్చటమే గాక స్వయంగా అతని రాచదర్బారులోని ప్రముఖ వ్యక్తులు వారి ప్రభుత్వ వ్యవహారాలతో విసుగెత్తి మొఘలులు దర్బారును ఆశ్రయించారు. ముర్తుజా స్వంత సోదరుడు బుర్హాన్ - II