మరణించిన వెంటనే అబుల్ హాసన్ ను గోల్కొండ రాజుగా ప్రకటించడమైనది. గోల్కొండ రాకుమారితో వివాహం, కుతుబ్ షాహి సింహాసనం పై అధిష్టానం సంఘటనలు ఎంత విచిత్రంగా, ఆసక్తికరంగా సాగాయో అదే విధంగా ఇతని పద్నాలుగు సంవత్సరాలపాలన 1672 క్రీ.శ. నుండి 1687 క్రీ.శ. వరకు ఆసక్తికరంగా సాగింది. హాసన్ అధికారంలో వుండగానే మొఘల్ దురాక్రమణతో గోల్కొండ పతనమయ్యింది. మొఘల్ చక్రవర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. బందీయైన అబుల్ హాసన్ కుతుబ్ షా తన చివరి రోజులను దౌలతాబాద్ కోటలో దుర్భరంగా గడిపాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, తన ప్రతినిధిగా రుహుల్లా ఖాన్ కు తాత్కాలికంగా హైదరాబాద్ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలనప్పగించినా, తరువాత అతని స్థానాన్ని 'జన్ సిఫార్ ఖాన్' గా పిలువబడే బహాదుర్ దిల్ ఖాన్ తో భర్తీ చేస్తాడు. క్లుప్తంగా, గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు ఏలిన వంశానుక్రమమిది.
బహమనీ రాజ్యంగా వున్న దక్కన్ పీఠభూమి ప్రాంతం, భారత ఉపఖండం లోని భాగమైనప్పటికీ, దక్కన్ తనదైన అస్తిత్వాన్ని, సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్నది. కాకతీయ రాజుల తర్వాత దక్షిణ భారత దేశంలో మహమ్మదీయ రాజులపాలన ఉనికిలోకి వచ్చింది. భారతదేశపు దక్షిణ భూభాగం, ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో వున్న దక్కన్లో, అవకాశం చిక్కిన ప్రతిసారి స్థానిక పాలకులు, సామంతులు స్వతంత్రంగా ప్రవర్తించేవారు. అదే కోవలో బహమనీ వంశ స్థాపకుడైన హాసన్ గంగు బహమన్ షా గా పిలువబడే అలావుద్దీన్ హసన్ బహమన్ షా సుల్తాన్ (Alauddin Hasan Bahaman Shah Sultan), స్వయంగా బహమనీ సామ్రాజ్యానికి స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని, గుల్బర్గా రాజధానిగా పాలన సాగించాడు. తర్వాత, షాహబుద్దీన్ అహ్మద్ ద్వారా రాజధాని బీదర్ కు మార్చబడింది. కాలక్రమంగా, బహమనీ సామ్రాజ్య క్షేత్ర పరిధి ఐదు రాజ్యాలుగా విడిపోయింది. అందులో ఒకటి గోల్కొండ.
అనేక రాజకీయ సంక్షోభాల కారణంగా ఐదు భాగాలుగా విడిపోయిన రాజ్యాలు: నిజాం షాహీల పాలనలో అహ్మద్ నగర్, ఆదిల్ షాహీలు బీజాపూర్ ను, కుతుబ్ షాహీలు గోల్కొండను, బీదరు బరీద్ షాలు, బీరార్ ను ఇమద్ షాలు పాలించారు.
కుతుబ్ షాహీల వంశపాలన, దక్కన్ పీఠభూమిని ఏలిన సల్తనేట్ ల మధ్య వున్న రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల, రక్షణ వ్యవస్థ, పాలనా వ్యవహారాలు, గోల్కొండ కోట, హైదరాబాద్ నగర నిర్మాణానికి అనువైన సంఘటనలు ఇత్యాది విషయాలపై సమగ్ర చిత్రణగా 1939లో అబ్దుల్ మజీద్ సిద్దిఖి, “తారీఖ్-ఎ గోల్కొండ" అనే శీర్షికతో ఉర్దూలో రచించిన గ్రంథాన్ని తిరిగి తానే ఆంగ్లంలో, 1956 లో ప్రథమ ముద్రణగా, History of Golcondaను ఆంగ్ల పాఠకుల