అధ్యాయం - 8
విదేశాంగ విధానం - అధికారాల సమతుల్యత
(The Foreign Policy and Balance of power)
అంతరాష్ట్రాల మధ్య యుద్ధాల కారణంచే అగ్నిగుండంలా మారిన సందర్భంలో సింహాసనంపై మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆసీనుడయ్యాడు. ఎప్పటికీ మరచిపోలేని ఘటనగా ఉన్న తాళికోట యుద్ధానికి ముందు వున్న నాలుగు రాజ్యాల మిత్రపక్ష కూటమి మధ్యగల స్నేహ సంబంధాలు ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. యుద్ధం తర్వాత మిత్ర పక్ష కూటమి అనతి కాలంలోనే చీలిపోయి, ఏకలక్ష్యంగా వున్న తమ సమూహ శత్రువును అణచివేసిన సంఘటిత శక్తి దేనికదే విడిపోయి ఒంటరి వయ్యాయి. పరిస్థితులు అలా దిగజారిపోవడానికి ప్రధాన హేతువు తాళికోట విజయానికి మూలస్తంభం, దక్కన్ యోధుడు హుసేన్ నిజాం షా (Husain Nizam Shah) మరణం. చారిత్రాత్మకమైన తాళికోట యుద్ధభూమి నుండి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతను దివంగతుడయ్యాడు. అతని మరణంతో దేశమంతా సంతాపం ప్రకటించింది. నిజాం షా మరణం వలన కలిగిన తీవ్రమైన లోటును ఇటు ప్రభుత్వం అటు ప్రజలు రెండూ అనుభవించసాగాయి. ప్రజలవిషాదాన్ని చూపడానికి ఈ పదాలు చాలు. "దక్కన్ సూర్యుడు అస్తమించాడు”. అకాలమరణం రాజకీయ అనిశ్చితిని సృష్టించడమే కాకుండా, దక్కన్ తిరిగి యుద్ధానికి ముందు వున్న గడ్డు పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. తుచ్ఛమైన ద్వేష భావాలకు మూలకారకుడైన అలీ ఆదిల్ షా ఇంకా జీవించే వున్నాడు. తన కుట్రలు, పన్నాగాల సిద్ధాంతాలను రుద్దుతూ తన విరోధి యైన అహ్మద్ నగర్ కు సమస్యల ఊబిలోకి దింపే ప్రయత్నాలు చేయసాగాడు. అప్పుడు అహ్మద్ నగర్, హుసేన్ నిజాం షా కుమారుడు, వారసుడైన ముర్తుజా నిజాం షా పాలనలో వుంది. మానసిక స్థితి సరిగా వుండక