వెతికి వుంచాను
అదిగో ! కారణం ప్రకటించబడింది.
కొత్త రాజు రాకతో ప్రపంచమంతా ఉల్లాస భరితమైంది.
మీకై ప్రార్థన చేసే గొప్ప హక్కు గలఈ మోమిన్ మనసంతా
ప్రార్థనతో నిండిపోయింది.
మీరు నూతన మకుటధారియైన మహారాజులు;
నేను మీ గుణకీర్తులను స్తుతించేవాడిని”
భావగీతిక - 2
“(ప్రజల) విశ్వాసాన్ని కాపాడే రాజు, రాచదుస్తులతో దర్శనమివ్వగానే
ప్రపంచం ఆనందంతో ఉప్పొంగిపోయింది
దయాళువైన భూపతి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
సొగసైన శుభజననం - విజయం, అదృష్ట దేవత సదా తోడుగా
నిలిచి వుంటాయి
మంచి ఆలోచన గలవారి చేతిలో వైభవం, శోభ సురక్షితంగా వుంటుంది.
సమస్త మానవ జాతికి అతని సుపరిపాలన అండగా వుంటుంది”.
పద్నాలుగు సంవత్సరాలు కూడా మించని సుల్తాన్ మహమ్మద్ పాలన గోల్కొండ చరిత్రలోనే శాంతి, సుసంపన్నతల యుగంగా చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పదిలపరుచుకుంది. రాజ్యంలో ఎక్కడ కూడా అంతర్గత పోరాటాలు, ఘర్షణలు, బయట నుండి ప్రమాదాలు రాకుండా తగిన సైనిక రక్షణ దళ ఏర్పాట్లు చేయడంతో కృతకృత్యుడైన, కీర్తి శేషుడైన మహమ్మద్ కులీ ధన్యుడు. శాంతి నెలకొన్న సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన సుల్తాన్ మహమ్మద్ అదృష్టవంతుడు. దాదాపుగా పొరుగున వున్న రాజ్యాలన్నీ అదుపులో వున్నాయి. సరిహద్దు క్షేత్రాలను బందోబస్తుగా రాజ్యానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తూ పునర్నిర్మించబడినాయి. ఫలితంగా పరిపాలనా కాలం మొత్తంగా శాంతి రాజ్యమేలి ప్రభుత్వానికి, ఇతర సామాజిక, ప్రజల మేధో సంపత్తిని పెంపొందించే దిశగా దృష్టి పెట్టే అవకాశం కలిగింది. దక్కన్ కు ఉత్తరాన వున్న ప్రాంతాల్లో మొఘలు చక్రవర్తులకు, వాస్తవానికి మాలిక్ అంబర్ అధికారంలో వున్న నిజాం షాహీ సుల్తాన్లకు మధ్య యుద్ధ వాతావరణం వుండి రక్తపాతం జరుగుతూ వుండే బీభత్స పరిస్థితుల్లో కూడా గోల్కొండ రాజ్యానికి ఎలాంటి ముప్పు కాని, శాంతికి భంగం వాటిల్లడం కాని జరగలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. గోల్కొండకు ఈ యుద్ధాలతో ప్రత్యక్ష సంబంధం లేకున్నా, పరోక్షంగా నిజాం షాహిలతో సంబంధాలను పెట్టుకునేది. ఐనా గోల్కొండ రాజ్యం యుద్ధ వాతావరణానికి బహుదూరంగా వుండేది.