Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపించారు. కాని ఈ మధ్యకాలంలోనే అహ్మద్ నగర్ పై మొఘల్ ల ముట్టడి, వెంకటపతికి మరొక అనుకూలమైన అవకాశంగా అంది వచ్చింది. వెంటనే ఘనపురం మీద దాడి చేసి, స్థానిక అధికారి ఆదిల్ ఖాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశాడు. దేశానికి ఈశాన్యంలో వున్న ఉత్తరాది తిరుగుబాటుదారులు ప్రదర్శించిన వ్యతిరేకతను మట్టి కరిపించాడు. బాలందర్ రాజ్ (Balandar Raj) వారసుడిగా 'కాసిం కోట'కు రాజైన యువకుడు కూడా తన విధేయతను ఉపసంహరించుకుని తను పంపవలసిన మర్యాద పూర్వక కానుకలను నిలిపివేశాడు. ఇతన్ని కూడా అమీనుల్ ముల్క్ అణిచివేశాడు. రాజమండ్రి, వెల్లూరులో చెలరేగిన స్థానిక విప్లవకారులను కూడా అణచివేశాడు. చివరి విప్లవకారుణ్ణి సైతం అణచివేశాక మహమ్మద్ కులీ సాంస్కృతిక కార్యక్రమాల్లో మక్కువ చూపడం మొదలు పెట్టాడు. అలా కాలక్రమేణా తన రాజ్యాన్ని శాంతి మార్గం వైపు, అభివృద్ధి దిశగా నడిపిస్తూ, సుపరిపాలనతో స్వర్ణయుగానికి నాంది పలికాడు.