Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్నంబులును సర్వబీజంబులును సర్వౌషధులును క్షీరవంతంబులైనతరువులకుసు
మంబులును శ్వేతమాల్యానులేపనంబులును స్థలజలజంబులును సుగంధిమాల్యం
బులును దివ్యంబు లగుచందనంబులును జాతరూపంబును హరిద్రాక్షతంబులును
బ్రియం బగుమధుసర్పిర్ధధిప్రముఖనిఖలమంగళద్రవ్యంబులును వైయాఘ్రం బగు
చర్మంబును గోరోచనయును మనశ్శిలయునుం దక్కిన సర్వోపకరణసంభారంబు
లన్నియు సమకూర్చిరి పదియార్గురు కన్యకలు సర్వాలంకారశోభితలై యభిషేకా
ర్థంబు పూర్వోక్తమంగళద్రవ్యంబులు కరంబులం గొని చనుదెంచి రంత యథా
కాలంబున నన్నవస్త్రసువర్ణమణిప్రదానంబుల విప్రులం బూజించి మంత్రకో
విదు లగువారు కుశపరిస్తీర్ణ యగువేదికయందు ననలుం బ్రతిష్ఠించి మంగళా
భ్యుదయార్థంబు మంత్రపూతంబు లైనహవిరాజ్యహోమంబులు గావించి వరా
స్తరణచిత్రమాల్యోపశోభితసువర్ణప్రసాదశిఖరోపరివిరచితమణిమయసింహాస
నంబునఁ బ్రాఙ్ముఖంబుగా సుగ్రీవు నాసీనుం గావించి సువర్ణకలశవృషభశృంగం
బులం బట్టి తెచ్చిన సకలనదీనదసముద్రసరోవరపుణ్యతీర్థంబులచేత మహర్షివిహి
తశాస్త్రదృష్టివిధానంబున గజగవయగవాక్షగంధమాదనశరభమైందద్వివిద
జాంబవదాంజనేయప్రభృతినిఖిలవానరులు వసువులు వాసవునింబోలె సుగ్రీవు
నభిషేకించి రప్పుడు.

641


తే.

అనఘుఁ డినపుత్రుఁ డభిషిక్తుఁ డగుచు నుండ
నఖిలవానరపుంగవు లమితహర్ష
కలితచిత్తు లై గుంపులు గట్టి భద్ర
వాక్యముల జయ పెట్టి రవార్యసరణి.

642


క.

జనవిభుఁ డగురామునిశా, సనమున సుగ్రీవుఁ డాత్మసము నంగదుని
న్ఘనముగ సంభావించుచుఁ, బనివడి తగ యౌవరాజ్యపరమున నిలిపెన్.

643


ఉ.

అంగదుఁ డర్కవర్ణకనకాంగదుఁ డిట్లు కృతాభిషేకుఁ డై
సంగతి మీఱ దివ్యవిలసన్మృదుతేజమునన్ జెలంగుచుం
డం గని సర్వవావరు లెడందల సంతన మంది కౌశలో
క్తిం గడు సన్నుతించి రలకీశపతిన్ రఘువంశవర్యులన్.

644


క.

నిరుపమహర్షోత్కర్షిత, గురుకపిహర్షప్రభూతకోలాహలసం
భరితం బై కిష్కింధా, పుర మప్పుడు సలిలరాశిఁ బోలెఁ జెలంగెన్.

645

రామలక్ష్మణులు ఋశ్యమూకముఁ జేరుట

ఉ.

అంత నిజాభిషేకకథ యంతయు సూర్యుసుతుండు రామభూ
కాంతునితోడఁ జెప్పి తనకాంతను నారుమఁ గూడి సమ్మద
స్వాంతముతో మనోజసుఖవారిధిఁ దేలుచు ధర్మయుక్తిచే
నెంతయుఁ గీశరాజ్యపద మేలుచు నుండెఁ గుమారయుక్తుఁడై.

646