Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/879

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

సాక్ష్మాన్మాధవుఁ డౌట రాముఁడు రహి న్స్థానీయముం బాసి స
త్రక్షోణిం జరియింప నేగుతఱి ఘర్మవ్యాప్తి నేవృక్షముల్
ప్రక్షీణద్యుతి శుష్కపత్రకలన న్లక్షింప రాకుండెఁ ద
ద్వృక్షంబు ల్దనరె న్బలాశకుసుమోపేతంబు లై యత్తఱిన్.

3282

రాముఁడు రాజమందిరంబు ప్రవేశించుట

ఉ.

ఆరఘువర్యుఁ డీగతి మహావిభవంబున రాజవీథి నిం
పార నితాంతశీతలకటాక్షములం బురివారి నందఱన్
వారక చూచుచుం జని ప్రభాప్రవిభాసితరాజమందిర
ద్వారముఁ జేరెఁ బంచవిధవాద్యరవంబులు మిన్ను ముట్టఁగన్.

3283


ఉ.

అచ్చటఁ దేరు డిగ్గి హరిణాంకుఁడు శారదమేఘపంక్తిలోఁ
జొచ్చినరీతి వజ్రరుచిశోభితరాజగృహంబుఁ జేరి తా
నచ్చుపడంగఁ దల్లులకు సందఱకుం బ్రణమిల్లి వేడ్క వా
రిచ్చినదీనన ల్గొని రహిం బితృసద్మముఁ జేరఁ బ్రీతితోన్.

3284


వ.

ఇట్లు సముచితంబుగాఁ బితృగృహంబు ప్రవేశించి భరతు నవలోకించి మధురం
బుగా నిట్లనియె.

3285


చ.

సురుచిరరత్నకాంతుల నశోకవనంబులఁ బద్మకైరవ
స్ఫురితసరోవరంబులను శోభిలుమామకమందిరంబునం
దరణిజు నుంపుమన్నఁ బ్రమదంబున నాతఁడు చేయిఁ బట్టి గ్ర
చ్చఱఁ గొని పోయి తద్విపులసద్మమున న్విడియించె నాతనిన్.

3286


తే.

అంత శత్రుఘ్నచోదితు లై సమస్త, పరిజనంబులు తైలదీపములు కనక
చారుపర్యంకములు వరాసనములు గొని, వెసఁ బ్రవేశించి రారామవేశ్మమందు.

3287


వ.

అప్పు డాభరతుండు తక్కినవానరుల నందఱ యథార్హస్థానంబుల విడియనియ
మించి సుగ్రీవు నవలోకించి యిట్లనియె.

3288

సుగ్రీవుఁడు వానరులకుఁ జతుస్సముద్రంబుల నుండి యుదకము దేర నియోగించుట

మ.

వనికిం జైత్రసమాగమం బవనికిన్ వర్షాగమంబుం బయో
జినికిం దీవ్రకరోదయంబు నిశికి న్శీతాంశుసలబ్ధి య
బ్బినయ ట్లయ్యె మహానుభావుఁడు రణాభీరుండు కళ్యాణభా
జన మౌరామునిరాక యీనగరికి న్శాఖామృగాధీశ్వరా.

3289


ఉ.

మిత్రసుతుండ వీవు మఱి మిత్రకులోత్థుల మేము గావున
న్మైత్రి ఘటిల్లె నీపగిది మాకును మీకును దైవతంత్ర మీ
చిత్రము ధీవరా తడవు సేయఁగ రా దిఁక నెల్లి భవ్యన
క్షత్రమునందు రామునకు గ్రక్కునఁ బట్టము గట్టు మున్నతిన్.

3290