Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/849

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యనిన విని యంజలి ఘటించి యాస రేంద్ర
చంద్రుతో వెండి యలవిభీషణుఁడు పలికె.

3039


చ.

పురుషవరేణ్య చూడు మదె పుష్పకనామవిమానరాజ మం
బరమణిసన్నికాశము సమంచితరత్నవినిర్మితంబు వి
స్ఫురితశిరస్సహస్రము సముజ్వలభద్రవితానయుక్త మం
బరచరము న్మనోజవము భవ్యము కామగ మెన్ని చూడఁగన్.

3040


ఆ.

దీనిమీఁద నెక్కి తేని రఘూత్తమ, యొక్కపవటిలో నయోధ్య కెలమిఁ
గోర్కి మీఱ నిన్నుఁ గొనిపోవు దుర్గమ, పథ మనుచు విచారపడఁగ వలదు.

3041


క.

ఈదివ్యవిమానము మును, శ్రీదుఁడు మాయన్న తపముఁ జేసి నలువ చే
మోదమునఁ బడసె రావణుఁ, డాధనపతి నాజిఁ దోలి యటు కొని తెచ్చెన్.

3042


క.

అనఘా భవదర్థం బది, మునుకొని పాలింపఁబడియె ముదము దలిర్పం
గొని తెప్పించెద మీ రిపు, డనుపమగతి దాని నెక్కి యరుగుఁడు ప్రీతిన్.

3043


వ.

దేవా యేను నీ కంతరంగభక్తుండ నేని నాయందుఁ గృప గల దేని మత్ప్రాణ
ధనంబులు భవదధీనంబులు చేసి యుండుట సత్యం బేని సీతాలక్ష్మణసహితం
బుగా నొక్కింతకాలం బిచ్చట వసించి నాచేత సర్వకామంబుల నర్చితుండవై
సైన్యసుహృజ్జనసహితంబుగా శాస్త్రవిహితం బైనమత్పూజనంబు మత్సకాశం
బున నుండి ప్రతిగ్రహించి ప్రీతియుక్తుండ వై యరుగవలయు నేను నీకు
భృత్యుండ నగుటవలన నీమాట ప్రణయబహుమానసౌహృదంబులవలన
నాడితిఁ గాని యాజ్ఞాపించినవాఁడఁ గా నని ప్రార్థించిన నారఘువల్లభుం డలరి
సర్వజనంబులు వినుచుండ వెండియు నవ్విభీషణున కి ట్లనియె.

3044


చ.

దనుజవరేణ్య నీ విపుడు తద్దయుఁ బల్కినమాటకంటెఁ బూ
జన మధికంబె సఖ్యమున సర్వవిధోత్తమబాంధవంబున
న్ఘనతరసౌహృదంబున నకల్మషభక్తి ననారతంబు నే
ననుపమభంగిఁ బూజితుఁడ నైతిని నా కొకభేద మున్నదే.

3045


చ.

గురుతరచిత్రకూటగిరికూటముపై వసియించి యున్నన
న్నరుదుగఁ గ్రమ్మఱించుటకు నచ్చటి కెవ్వఁడు వచ్చె సారెకు
న్శిరమున యాచితుండ నయి చేకొని యెవ్వనికోర్కి దీర్ప కేఁ
బఱపితి వీటి కాభరతు భక్తిరతు న్వెసఁ జూడఁ గోరెదన్.

3046


క.

గురువుల వృద్ధులఁ బౌరుల, నరుదారఁగ జానపదుల నఖిలసచివులం
బరమాప్తుల జనయిత్రుల, గర మనురాగమునఁ జూడఁ గాంక్ష వొడమెడిన్.

3047


చ.

దనుజవరేణ్య మా కిచటఁ దాలిమితో నిలువంగ రాదు వ
చ్చినపని చక్కనయ్యె నిఁక శీఘ్రమునం బురికిం జన న్వలె
న్ఘనముగ నేను నేఁ డఖిలకామములం బ్రతిబూజితుండ నై
తిని దడ వేల నీ వనుమతించి విమానము దేరఁ బంపుమా.

3048