Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/753

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దాశరథిబాణములు ఘో, రాశీవిషనిభము లగుచు నద్భుతభంగిన్
రాశీభూతము లై రా, నోసరక సహింప నెవ్వఁ డోపు మృగాక్షీ.

2354


చ.

సురపతివజ్రము హరునిశూలము కాలునిదండమున్ ధనే
శ్వరుగదయుం బయోధిపతిపాశము నైరృతరాజఖడ్గము
న్దురమునఁ జీరికిం గొనక దోర్బలశక్తి వెలుంగునేను సం
గరమున నొక్కమర్త్యువిశిఖంబులఁ జిక్కితి నేమి చెప్పుదున్.

2355


క.

ఏలాగు రాఘవుని నే, నాలంబునఁ గడచువాఁడ నాతనిరూపం
బాలోకించినయంతనె, కాలుం డనుసంశయంబు గలిగెడుఁ దన్వీ.

2356


చ.

నయవిదుఁ డావిభీషణుఁడు నాఁ డటు నీతి యెఱుంగఁ బల్క దు
ర్నయమున నేను గైకొనక గ్రక్కునఁ బ్రో ల్వెడలంగఁ బుచ్చితిన్
నియతమనస్కుఁ డాతఁ డొగి నేర్పునఁ జెప్పినమాట లన్ని త
ద్దయు నిజ మయ్యె నేఁడు వనితా యిపు డేమన నేమి కాఁదగున్.

2357


క.

దివియందు జలధులందును, భువియందును దిక్కులందు బూర్ణము లై రా
ఘవునిపటుదివ్యబాణము, లవిరళగతి నిండియున్నయట్లుగఁ దోఁచెన్.

2358


క.

కను మూసినఁ గను విచ్చిన, ఘనుఁ డారాఘవుఁడు మ్రోలఁ గన నయ్యెడు వే
యన నేల భువన మంతయు, వనితా రామమయ మగుచు వారక తోఁచెన్.

2359


వ.

దేవీ నా కిప్పు డొండుశరణంబు లేదు దర్పకదర్పహరణుండును జంద్రకిరీటాలం
కృతమస్తకుండును మందాకినీసరిత్సలిలపూరితజటాజూటుండును వ్యాఘ్ర
చర్మాంబరధరుండును విభూత్యనులిప్తసర్వావయవుండును నాగయజ్ఞోపవీతధరుం
డును గజచర్మోత్తరీయుండును ద్రిశూలాలంకృతకరుండును భక్తానుగ్రహవిగ్ర
హుండును శైలజావిభూషితవామభాగుండును సకలలోకశంకరుండు నగుశంక
రుని శరణంబు నొందెద నప్పరమేశ్వరుండు తొల్లి మదీయసంగీతంబునకు మెచ్చి
పరమదయాళుండై యెప్పు డేనియు నీకరులవలన సంగ్రామంబునఁ బరాజయంబు
గలుగునప్పుడు నన్ను నుద్దేశించి హోమంబు గావింపు మవ్వేలిమి విఘ్నంబు
లేకుండఁ భారంబు నొందెనేని వహ్నికుండంబున నుండి దివ్యాశ్వసమన్వితం
బైనదివ్యరథంబును దివ్యాస్త్రంబులును దివ్యకవచశరాసనతూణీరంబులునుం
బొడము నమ్మహనీయసాధనంబులు గైకొని రణంబున కరిగితి వేని గెలు పవశ్యంబు
గలుగు నని యాదేశించెం గావున నే నిప్పు డమ్మహానుభావు నుద్దేశించి హో
మంబు గావించెద నని పలికి శీఘ్రంబున సుస్నాతుండై ధౌతాంబరంబులు
ధరించి యొక్కశివాలయంబునకుం జని యం దొక్కవేదిక నిర్మించి మంత్ర
విదు లగుబ్రహ్మరాక్షసుల యాజకులుగా నియమించి సమిత్కుశలాజపుష్పాక్ష
తాదికంబులు సంగ్రహించి బలవంతు లగురాక్షసులఁ జుట్టునుం గాపువెట్టి
హోమంబు గావింప సమకట్టిన నప్పు డచ్చటికిఁ దలోదరి యగుమందోదరి చను
దెంచి నిజభర్త నవలోకించి యి ట్లనియె.

2360