Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యగు రుమయందు వర్తించితివి గావున నీదోషంబునకును సుగ్రీవునిదోషంబు
నకును వైషమ్యంబు గల దట్లగుటంజేసి నిన్ను వధించితి దీన దుష్టునిగ్రహశిష్టపరి
పాలనదురంధరసార్వభౌమభరతమహీపాలకాజ్ఞాకారి నగునాకు దోషంబు లేదు.

478


ఆ.

పరమధర్మవిదుఁడు భరతుఁ డధీశుఁ డే, మతనియాజ్ఞఁ బూని యలరువార
మీవు సాధుధర్మహీనవర్తనుఁడ వు, పేక్ష సేయ వచ్చు టెట్లు మాకు.

479


తే.

ధర్మసంస్థాపనంబు నధర్మనిగ్ర, హంబు భరతున కివి పను లతనియాజ్ఞఁ
బూని చరియించెదము మిముబోఁటి దుష్ట, వర్తనులఁ బట్టి తునిమెడువాంఛఁ జేసి.

480


వ.

అదియునుం గాక లక్ష్మణునితోడం బోలె సుగ్రీవునితోడ వహ్నిసాక్షికంబుగా
దారరాజ్యనిమిత్తంబు సఖ్యంబుఁ జేసి వాలిం బరిమార్చెద నని వానరమధ్యం
బున బాస యిచ్చియున్నవాఁడ నాసుగ్రీవుండు నాకు నిశ్శ్రేయసకరుండు గా
వున మిత్రశత్రుండ వైన నిన్ను వధించి ప్రతిజ్ఞ నెఱపుట ధర్మవిరోధంబు గాదు
ప్రాణసమానమిత్రుం డైనసుగ్రీవునకు శత్రుండ వైననీవు నాకు శత్రుండ వగుట
కేమి సందియంబు నిన్ను వధింపనినాఁడు నాకు మిత్రద్రోహదోషంబు వాటిల్లు
నిష్కారణంబుగా నిన్ను వధించినవాఁడఁ గాను భ్రాతృభార్యాపహరణభరతా
జ్ఞాకరణసుగ్రీవసఖ్యకరణప్రతిజ్ఞాకరణాదిధర్మసంహితసమస్తకారణంబులచేత భ్రా
తృభార్యాపహారకుండ వైననిన్ను శాసించితి నిది శాస్త్రవిహితం బని నీవు నూ
హింపవచ్చు సర్వప్రకారంబుల భవన్నిగ్రహంబు సాధుసమ్మతం బగుం గాని నిం
దితంబు గాదు ధర్మవిశారదుం డగువాఁడు వయస్యుని కేనియు నేతాదృశపాపం
బొనర్చినవాని కేతాదృశదండంబు విధింపవలయు ధర్మవిశారదుండ వగునీవును
మద్విహితం బగుదండం బంగీకరింపవలయుం గాని నిందింపంజనదు మదీయదం
డంబున నీవు దురితంబులం బాసి పుణ్యగతికిం జనియెద వీయర్థంబునందుఁ
గొన్ని మనువచనంబులు గల వవి చారిత్రవత్సలంబులై ధర్మకుశలు లగువారల
చేత గృహీతంబులై యుండుఁ దత్ప్రకారంబు వినుము.

481


క.

జను లఘము లాచరించియు, జనవరకృతదండు లగుచు సన్నుతయశులై
యనిమిషలోకపదమునకు, సునిశితగతిఁ జనుదు రధికసుకృతులమాడ్కిన్.

482


క.

జననిందిత మగువృత్తము, గొనకొని కావించు నట్టికుజనుల దండిం
పనినాఁడు రాజు వారల, ఘనతరదోషముల నొందఁగలఁడు నిజముగాన్.

483


వ.

అని మనువు చెప్పె నదియునుం గాక తొల్లి నీచేతం బోలె నొక్కక్షపణకునిచేతఁ
బాపం బాచరితం బగుచు నుండ మద్వంశశ్రేష్ఠుం డైనమాంధాతచేత నాశ్రమ
ణునియందు ఘోరం బగుదండంబు ప్రయుక్తం బయ్యె మఱియు రాజులు
ప్రమత్తు లగుచు నుండఁ గొందఱు జనులు నీయట్ల పాపం బాచరించి రావసుధా
ధివులు పిమ్మట ధర్మపరామర్శవేళయందు గతప్రమాదులై నియమపద్ధతి నప్పా
పాత్ములకు వధబంధనాదికప్రాయశ్చిత్తంబు గావించిరి దండకర్మంబున నమ్మహీ
వతులకు దుష్కృతం బొదవలేదు గావున.

484