| క. |
వంచించి కానఁబడక వ, ధించితి గా కెదుట నిల్చి ధీరత ననిఁ గా
వించిన నీను యమపురికి నొ, కించుకమాత్రమునఁ బుచ్చనే యవలీలన్.
| 457
|
| తే. |
అవనినాథ దుర్దర్షుఁడ నైనయేను, మొనసి నీచేతఁ జచ్చితి మోసపోయి
కాలసంయోగమునఁ జేసి గాఢనిద్రఁ, జెందిననరుండు సర్పంబుచేతఁ బోలె.
| 458
|
| క. |
నాతో నీదగు కార్యము, చేతోముద మలర మున్నె జెప్పితి వేనిన్
ఖ్యాతిగ నొకగడెలో ధర, ణీతనయను దెచ్చి యొసఁగనే యవలీలన్.
| 459
|
| ఉ. |
భూనరవర్య యెవ్వని సముద్ధతిఁ జంపుటకై గడంగి సు
గ్రీవునితోడ నెయ్య మొనరించి తదీప్సితసిద్ధిఁ గోరి న
న్నీవిధిఁ జంపి తట్టిదనుజేంద్రుని రావణు గీటడంచి నీ
దేవిని నెందు డాఁచినను దెచ్చి యొసంగనె యొక్కవ్రేల్మిడిన్.
| 460
|
| క. |
జలధిజలమందు డాఁచిన, నలయక పాతాళజగమునందు నిడిన మై
థిలిని గొని తెచ్చి యొసఁగనె, పొలుపుగ శ్వేతాశ్వతరినిబోలె నరేంద్రా.
| 461
|
| వ. |
రాజనందనా సుగ్రీవుండు నాకు జ్ఞాతి గావున నన్ను వధించి వానరరాజ్యంబుఁ
గైకొను టది యతనికి యుక్తధర్మం బగుం గాని వంచించి రణంబున నన్ను
వధించు టది నీకు యుక్తధర్మంబు గాదు లోకంబునందు మర్త్యుల కెల్ల మర
ణంబు గలుగు టది నిసర్గంబు నీచేతఁ గావింపం బడినయీకృత్రిమవధరూప
కార్యంబు యుక్తం బగునేని సమాధాయకం బైనయుత్తరంబు యోచించి
చెప్పు మని పలికి.
| 462
|
| క. |
ఘనుఁ డైనపాకశాసన, తనయుఁడు నోరెండఁ దీవ్రతరశరకృతవే
దన కోర్వక దశరథతన, యునిఁ జూచుచు మాట లుడిగి యూరక యుండెన్.
| 463
|
| తే. |
సాధువినుతంబు ధర్మార్థసంహితంబు, పరుష ముహితంబు యోగ్యంబు ప్రశ్రితంబు
నగుపురందరసుతువాక్య మాలకించి, వాక్యకోవిదుఁ డారఘువర్యుఁ డపుడు.
| 464
|
రాముఁడు వాలికిఁ బ్రత్యుత్తరములు చెప్పుట
| మ. |
హతభానుం డనుభానుభంగి గతతోయాభ్రంబుచందాన సం
హతతేజుం డగువహ్నిరీతి వికలుం డై యున్నవాని న్సము
న్నతసత్త్వాఢ్యుని వ్యక్తవాక్యుని రణన్యాయైకశీలు న్సమి
జ్జితశూరాలిని వాలిఁ గాంచి నయముం జెల్వందఁగా నిట్లనున్.
| 465
|
| తే. |
అగచరకులాగ్రగణ్య ధర్మార్థకామ, ములును లౌకికసమయంబు దెలియ కిపుడు
బాలిశత్వంబువలన నీపగిది నన్ను, నిష్ఠురోక్తుల నిందింప నీకుఁ దగునె.
| 466
|
| క. |
గురుసమ్మతు లతిసుగుణో, త్తరు లగుపెద్దలవిధంబుఁ దలఁప కిపుడు వా
నరచాపల్యమువలనను, దర మెఱుఁగక నన్ను దూఱఁ దగవే నీకున్.
| 467
|
| క. |
జలధిగిరిసహిత యగు నీ, యిల యిక్ష్వాకులది వారు మృగపక్షిమను
ష్యుల సమయ మరసి కావను, జలమున దండింప నధికశక్తులు ధాత్రిన్.
| 468
|