Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానుగ వచ్చె వాని లఘిమ న్గని వానరు లావిభీషణుం
డాకృపనందనుండు హృదయంబున విస్మయ మంది రయ్యెడన్.

2016


ఉ.

అంత దశాస్యపుత్రుఁడు దురంతకృతాంతబలాభిభూతుఁ డై
పంత మెలర్పఁ గార్ముకము బాగుగ సజ్యముఁ జేసి శౌర్య మం
తంతకు మీఱ సాయకసహస్రము లేసి వనాటసైన్య మిం
తింతలు తున్కలై వెస మహీస్థలిఁ గూలఁగఁ జేసి బల్విడిన్.

2017


ఉ.

వెండియు మండలీకృతనవీనశరాసనుఁ డై మహోద్దతిం
జండశిలీముఖంబు లతిసాంద్రముగాఁ బరఁగించి వేసవి
న్జండకరుండు తీవ్రకిరణంబులు నల్పజలాశయంబు ను
ద్దండత నింకఁ జేసినవిధంబునఁ గీశతతిం గలంచినన్.

2018


తే.

వికటమారారిమార్తి యై విక్రమించు, వానికోలల కోర్వక వానరాళి
నొచ్చి సౌమిత్రిశరణంబుఁ జొచ్చె నపుడు, భయము దీపింపఁ బ్రజ ప్రజాపతిని బోలె.

2019


క.

ఆరఘువర్యుఁడు వానర, వీరుల కభయంబుఁ దెల్పి వేగం బడరన్
భూరికరలాఘవంబున, సారాంబక మేసి వానిచాపము ద్రుంచెన్.

2020


క.

అతఁ డొండొకకోదండము, చతురతఁ గైకొనిన దానిఁ జయ్యన బాణ
త్రితయమునఁ దునిమె మఱియొక, వితతధనువు గొనిన దాని విసువక దునిమెన్.

2021


తే.

తునిమి తోడ్తోడఁ గ్రొవ్వాఁడితూపు లేసి, కత్తళము సించి పదపడి కాలఫణిస
మానశరపంచకంబున వానిగాత్ర, ముచ్చిపో నేసె వేల్పులు మెచ్చి పొగడ.

2022


క.

సౌమిత్రి కార్ముకస్రుత, భీమశరము లతనిమేను భేదించి వడిన్
వ్యోమమున కెగసి వెంటనె, భూమిం బడె రక్తగాత్రభోగులమాడ్కిన్.

2023


చ.

విడువక యింద్రజిత్తు రఘువీరవరాంబకభిన్నవర్ముఁ డై
కడువడి నోట శోణితము గ్రక్కుచు వేఱొకవిల్లు దాల్చి బి
ట్టడరి కులాద్రిమీఁద విలయాభ్రము వర్షము గుమ్మరించుకై
వడి రఘువర్యుమీఁద శరవర్ష మొగిం గురియించె నుద్ధతిన్.

2024


తే.

అర్కుఁ డాత్మీయకరముల నవిరళముగ, నెఱసికొని యున్నచీఁకటి విరియఁజేసి
నట్లు దశరథసుతుఁడు నిజాంబకముల, రాక్షసోత్సృష్టబాణవర్షంబు మాన్చె.

2025


ఆ.

మంచు విరియఁజేసి మహితతేజంబునఁ, గ్రాలుభానుగతి విరాజమానుఁ
డగుచు వైరిమీఁద నవిరళశరవృష్టి, గురిసి విస్మయంబు వఱలఁ జేసె.

2026


క.

సురవైరి మేన నాఁటిన, శరములు రఘువీరువింటిశరము లొకటి యై
పరికింపఁ ద్రాళ్ళు వెనఁచిన, కరణిం జూపట్టె నడిమి కాండము లెల్లన్.

2027


క.

ఒక్కొకని మూఁడుశరములఁ, దక్కినరక్కసులనెల్లఁ దద్దయుఁ గినుకన్
స్రుక్కించి మరల రావణి, నక్కజముగఁ బెక్కుఁగఱకుటమ్ముల నొంచెన్.

2028