Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిరంతరాయంబుగా సమాప్తి నొందెనేని కామసంచారక్షమతురంగమయుక్త
రథంబును గవచంబును జాపంబును దివ్యాస్త్రంబులును వహ్నిసకాశంబువలన
నుత్పన్నంబు లగుఁ దద్రథస్థుండై యాలంబులకుఁ జనిన నింద్రాదిసురుల కజ
య్యుం డగుననియును హోమంబు కడమపడెనేని వధ్యుం డగుననియును బలికెం
గావున నిప్పు డయ్యింద్రజిత్తు సైన్యసమేతంబుగా నికుంభిలకుం జని హోమంబు
సేయుచున్నవాఁ డాహోమంబు సమాప్తి నొందెనేని మనల నందఱ నిస్సంశ
యంబుగా వధియించుఁ గావున నవ్వేలిమి తుదిముట్టకమున్నె వాని వధించు
టకు మహావీరుం డైనలక్ష్మణుని నియోగింపుము మాయావి యగువీఁడు మడిసి
నం జాలు సుహృత్సమేతంబుగా రావణుండు నీచేత రణంబునం జచ్చినవాఁ డని
పలికిన నవ్విభీషణునివచనంబు విని రాముండు కలంక దేఱి క్రమ్మఱ నతని కి ట్లనియె.

1888


ఉ.

రాక్షసవర్య రౌద్రుఁ డగురావణిమాయ నెఱుంగుదు న్సమి
ద్దక్షుఁడు విక్రమాధికుఁడు దానవసత్తముఁ డస్త్రకోవిదుం
డక్షయబాహుసత్త్వుఁడు మహాత్ముఁడు వాఁ డనిలోన నాసహ
స్రాక్షయమాదిదిక్పతుల నైన విసంజ్ఞులఁ జేయు నుద్దతిన్.

1889


చ.

అరదముతోడ మింట రయమారఁ జరించెడువేళ నీనిశా
చరుగతి సాంద్రవారిధరసంప్లవమందు మహాత్ముఁ డైనభా
స్కరుగతిభంగిఁ జూపఱకుఁ గన్పడకుండు నిశాటవర్య వీఁ
డరయఁగ దేవదానవులకైన నసాధ్యుఁడు సంగరంబునన్.

1890


చ.

అని యిటు పల్కి రాముఁడు దురాత్మకుఁ డైననిశాటరాజనం
దనునిపరాక్రమంబును దతస్ఫుటమాయ నెఱింగి కీర్తివ
ర్ధనుని బరాక్రమాధికుఁ బ్రతాపవిశిష్టుని ధీరు లక్ష్మణుం
గనుఁగొని చూపులం గరుణ గన్పడి గారవ మొప్ప ని ట్లనున్.

1891

రాముఁ డింద్రజిద్వధమందు లక్ష్మణు నియోగించుట

ఉ.

వీరవరేణ్య సర్వకపివీరచమూగణసంయుతుండ వై
దారుణభంగి నేగి యలదానవనాథసుతున్ దురాత్మకున్
ధీరుని మాయికు న్బలవిధేయనిశాతశిలీముఖంబులం
బోరి వధించి రమ్ము పరిపూర్ణయశుండవు గమ్ము లక్ష్మణా.

1892


మ.

హనుమంతుండును జాంబవంతుఁడు ప్లవంగాధీశ్వరుం డంగదుం
డును నీలుండు నలుండు శంభుఁడు సుషేణుం డాసురాచార్యనం
దనుఁడుం గేసరి మున్నుగాఁ గలచమూనాథు ల్బలోపేతు లై
యనఘా నీవెనువెంట వచ్చెదరు బాహాటోప మేపారఁగన్.

1893


తే.

మనుకులవరేణ్య దానవమర్మవిదుఁడు
శత్రుభీషణుఁ డీవిభీషణుఁడు నీదు