| |
జూచి తానును మిక్కిలి శోక మొంది
యిట్లు దీను లై యున్నవా రేల యనుడు.
| 1875
|
| క. |
ఆయసురేంద్రునివదనము, పాయక వీక్షించి శోకబాష్పపరిక్లి
న్నాయతలోచనుఁ డై ప్రే, క్షాయుతుఁ డాలక్ష్మణుండు గ్రక్కునఁ బలికెన్.
| 1876
|
| తే. |
ఏమి చెప్పుదు దనుజేంద్ర యింద్రజిత్తు
జానకిని జంపె నని పవమానసుతుఁడు
చెప్ప విని రాఘవేంద్రుండు చిత్త మెరియఁ
గన్నుగవ మోడ్చి మౌని యై యున్నవాఁడు.
| 1877
|
| క. |
అన విని విభీషణుం డో, యనఘా యిది యేటిమాట యనుచు సుమిత్రా
తనయుని వారించి మహా, వినయంబునఁ జేరి రామవిభునకు ననియెన్.
| 1878
|
విభీషణుఁ డింద్రజిత్తుచే వధింపఁబడినది మాయాసీత యని రామున కెఱిఁగించుట
| ఉ. |
మానవనాథ మారుతకుమారుఁడు నీరధి యింకె నన్నచం
దాన వచించె నప్పలుకు నమ్మఁగ రాదు దురాత్ముఁ డైనయా
దానవభర్తడెందమునఁ దప్పక యున్నతలం పెఱుంగుదు
న్జానకిఁ జంపఁ జూడఁ డిది సత్యము శోకము నొంద నేటికిన్.
| 1879
|
| చ. |
జనవర యేను నీకు మును జానకి నిమ్మని యెంత చెప్పిన
న్వినఁడు నిశాటనాథుఁ డవివేకత నట్టిదురాత్ముఁ డేల సీ
తను వధియింపఁ బంపు నిది సత్యము గాదు యథార్ధ మేని పె
ల్చన సచరాచరంబు లగుసర్వజగంబులు నేఁడు గ్రుంగవే.
| 1880
|
| చ. |
విమలవిచార రావణుఁడు వేయివిధంబుల సామదానభే
దముల మహీజ వేఁడియును దత్తను వంటఁగఁ జాలఁ డయ్యె నీ
రమణిని దాఁక నన్యునితరంబె జడోద్ధతిఁ దాఁకె నేని స
ర్పము నొగిఁ గేలఁ గైకొనిన బాలునికైవడి నేలఁ గూలఁడే.
| 1881
|
| చ. |
ఇది యొకబొంకు గాని మనుజేశ్వర నిక్కము గాదు శక్రజి
త్తదయత గెల్పు చేకొనుట కాసురహోమ మొనర్పఁ బూని దు
ర్మదమున మాయఁ బన్ని సుకరంబుగఁ గీశుల నెల్ల నీగతిం
గదనమునందు మోహితులఁగా నొనరించె విచార మేటికిన్.
| 1882
|
ఇంద్రజిత్తు నికుంభిలయందు హోమము సేయుటను విభీషణుఁడు రామునకు దెల్పుట
| ఉ. |
ఆదివిజారి యిప్పుడు మహాత్మ నికుంభిల కేగి యచ్చటన్
మోద మెలర్ప హోమము సముద్ధతి సల్పుచు నున్నవాఁడు త
ద్వేదికయం దవిఘ్నముగ వేలిమి పారము ముట్టెనేని శ
క్రాదిదిగీశు లంద ఱొక టైనను వాని జయింపలే రనిన్.
| 1883
|