| |
దనుజబలంబుఁ జక్కడిచి తద్దయు శోకము రోష మాత్మలో
బెనఁగొన నొక్కభూరిగిరిశృంగము వే పెకలించి తెచ్చి చ
య్యన దశకంఠపుత్రునిశతాంగముపైఁ బడవైచె నుగ్రుఁ డై.
| 1828
|
| ఉ. |
వైచినఁ జూచి యారథికవర్యునిపంపున సుతుఁ డాత్మవి
ద్యాచతురత్వ మేర్పడ రథంబు రయంబున దాఁటఁ దోలినన్
వేచి తదద్రిశృంగ మతివేగమునం జని క్రూరుఁ డైనదో
షాచరమౌళిపైఁ బడక జన్యమహిం బడి గ్రుంగె నెంతయున్.
| 1829
|
| ఉ. |
తప్పక దానిక్రిందఁ బడి దైత్యు లనేకులు చూర్ణితాంగులై
రప్పుడు కీశవర్యు లనిలాత్మజుప్రాపున నిర్విశంకు లై
గొప్పశిల ల్మహీజములు గొబ్బునఁ గైకొని దానవావలిం
జెప్పెడి దేమి ఘోరగతిఁ జిందఱవందఱ చేసి రుద్ధతిన్.
| 1830
|
| చ. |
గగనము తూఁటుగట్టఁ బటుగర్జలు సల్పుచు నింద్రజిత్తుపై
నగములు గ్రావము ల్తరుగణంబులు లెక్కకు వెక్కసంబుగా
నిగుడఁగఁ జేసి వెండియు వనేచరు లశ్మగిరీంద్రవృష్టిచే
మగఁటిమి మీఱ రాక్షససమాజములం బరిమార్చి రుద్ధతిన్.
| 1831
|
| క. |
విచ్చలవిడి ని ట్లవనీ, భృచ్చరు లడరించువృక్షవృష్టి నిశాటు
లచ్చిరి చొచ్చిరి విచ్చిరి, సొచ్చిరి శక్రారిమఱుఁగు సొంపుసెడి వెసన్.
| 1832
|
| క. |
తరుచరబలార్దితం బై, పఱచెడు నిజబలముఁ జూచి పటుకోపమున
సురవైరి ప్లవగతతిపై, నరదముఁ బఱపించె నుద్యతాయుధుఁ డగుచున్.
| 1833
|
| మ. |
శరజాలంబులు శూలము ల్ముసలము ల్చక్రంబులుం గుంతము
ల్వరశక్తు ల్కరవాలము ల్పరశువు ల్ప్రాసంబులు న్ఘోరము
ద్గరము ల్పట్టిసము ల్గద ల్పఱపి యుద్ధండప్రతాపంబునన్
హరిసేనం దునుమాడె సింహము సముద్యద్ధంతిరాజంబలెన్.
| 1834
|
| తే. |
వానిసూరెలఁ బన్ని దుర్వారబలులు
దానవులు విక్రమంబునఁ దరులు శిలలు
నిఖలశస్త్రంబు లడగించి నేర్పు మీఱఁ
దరుచరుల వ్రేసి నొప్పించి తఱిమి రపుడు.
| 1835
|
| వ. |
ఇత్తెఱంగున నప్పూర్వగీర్వాణులకోల్తల కోర్వక భయంబునం బఱచువాన
రులం జూచి హనుమంతుండు బరవసంబుఁ జేసి పురికొల్పి యంతకాకారుండై
పేర్చి యనేకశిలాసాలజాలంబుఁ బరఁగించి రాక్షసుల నవలీలం దోలి వానరుల
నవలోకించి యి ట్లనియె.
| 1836
|
హనుమంతుఁడు రామునియొద్దకుఁ బోవుట
| సీ. |
తరుచరులార యీదనుజాధముఁడు రామరమణిని జంపెఁ గార్యంబు దప్పె
నీసేన మన కిప్పు డెంతయు సాధింపఁ గాకున్న దింక సంగ్రామ మేల
|
|