| |
వననిధిఁ దాఁటి యత్నమున వచ్చితి రాసతి నీవు చూడఁగా
మునుకొని ఖడ్గధార శిరముం దెగవ్రేసెద నీక్షణంబునన్.
| 1820
|
ఇంద్రజిత్తు మాయాసీతం బట్టి తెగవ్రేయుట
| క. |
ఈరామఁ జంపి యవ్వల, నారాఘవు నతనియనుజు నంగదు నిన్నున్
వీరుని సుగ్రీవుని దివి, జారి విభీషణుని శితశరాలిఁ దునియెదన్.
| 1821
|
| క. |
సుదతుల వధింపఁ దగ దని, పదిలంబుగఁ బలికి తీవు పరులకుఁ బీడా
స్పద మగుకార్యం బదియే, యెదియైనను సేయ వచ్చు నెంతయుఁ బ్రీతిన్.
| 1822
|
| వ. |
అని పలికి యారావణనందనుండు తనయరదంబుమీఁద రోదనంబు సేయుచున్న
మాయాసీతం బట్టి శితధారం బగుఖడ్గంబున యజ్ఞోపవీతధారణప్రకారంబు
గాఁ దెగవ్రేసి పుడమిం ద్రోఁచి వెండియు హనుమంతు నవలోకించి వనజాప్త
కులసంభవుం డైనరామునిమనోహారిణి యగునీసీత నలుక వొడమినడెందంబు
నఁ గరవాలంబునం దెగవ్రేసితి మీరణోద్యోగంబు లెల్ల విఫలంబు లయ్యె
నింక నీవృత్తాంతంబు రామలక్ష్మణులకుం జెప్పఁ జను మని విజృంభించి పలికి
సంప్రహృష్టచిత్తుండై రథంబుమీఁద నుండి దిశాకుడ్యంబులు పగుల నొక్క
సింహనాదంబు చేసి వ్యూహీకృతరాక్షసపరివేష్టితరూపదుర్గంబు నాశ్రయించి
యుండె నంత దీర్ఘనిర్ఘాతసమనిర్ఘోషం బైనయమ్మహాధ్వని విని సమీపవర్తు
లగువానరులు భయభ్రాంతచిత్తులును విషణ్ణవదనులు నై సింహంబు గన్న
మహాద్విపంబులభంగి దిక్కులు సూచుచు చెదరి పఱచిన వానరులం జూచి బరవ
సంపుమాటలఁ బురికొల్పుచుఁ బవననందనుం డిట్లనియె.
| 1823
|
| చ. |
వనచరులార మీరు సరివారలు నవ్వ విషణ్ణవక్త్రులై
యనికిఁ దొఱంగి మిక్కిలి భయంబునఁ బాఱెద రేటి కిట్లు మీ
ఘనబల మెందుఁ బోయె గిరి గైకొని యేను గడంగి ముంగలం
జనియెద నాపిఱుందదెస సత్వరతం జనుదెండు ధీరులై.
| 1824
|
| క. |
నా విని వానరు లందఱుఁ, బావనివచనమునఁ దేఱి బాహాశౌర్య
ప్రావీణ్య మలర భూరి, గ్రావంబులు పాదపములు గైకొని పెలుచన్.
| 1825
|
హనుమంతుఁడు కోపంబు పెంపున నింద్రజిత్తునితోఁ బోరుట
| క. |
ఘనములక్రియ గర్జించుచు, హనుమంతునిఁ గూడి విక్రమాటోపములం
జని రాక్షససేనల మా, ర్కొనిరి మహీరజము గగనకుహరము మ్రింగన్.
| 1826
|
| ఉ. |
ఆహనుమంతుఁ డిట్లు విపినాటచమూయుతుఁ డై గడంగి యు
త్సాహ మెలర్ప నంతకునిచాడ్పునఁ గ్రాలుచుఁ దాఁకి వీఁకతో
సాహస మొప్ప దావశిఖి చెయ్యనఁ గాఱడవి న్దహించిన
ట్లాహవమేదిని న్నిశిచరాటవి నెల్ల దహించె నుద్ధతిన్.
| 1827
|
| చ. |
అనిలతనూజుఁ డిట్లు విలయానిలవేగము నొంది వీఁకతో
|
|