| |
లొలుక హారామ రామా యని యార్తరవంబున విలపించుచున్న మాయా
మైథిలి నొడిసి పట్టి యొక్కకరంబునఁ గరవాలం బంకించి వేఱొక్కకరంబునఁ
దలవెండ్రుకలఁ బట్టి దట్టించి యీడ్చిన నత్తెఱంగు విలోకించి కన్నీరు నించుచు
మనున్నందనుండు క్రోధాతిశయంబునఁ బరుషంబుగా వాని కి ట్లనియె.
| 1810
|
హనుమంతుం డింద్రజిత్తుని దూఱుట
| తే. |
ఓరి దుష్టాత్మ రాక్షసయోనిగతుఁడ
వైన నగుదు గా కేమి నీ వబ్జయోని
వంశమునఁ బుట్టినాఁడవు వసుమతీశు
తరుణి తలఁ బట్టుకొని యీడ్వఁ దగునె నీకు.
| 1811
|
| తే. |
ఇట్టిదుష్కర్మ మొనరించితేని యింకఁ
బాపకర్ముండు క్షుద్రుం డపండితుండు
వీర్యహీనుండు ఖలుఁ డని విన్నవారు
నిన్ను ధిక్కృతుఁ జేయరే నీచచరిత.
| 1812
|
| తే. |
కదనమున శత్రునంతటిఘనుని గెలిచి, పృథివిలో నింద్రజిత్తనఁ బేరు వడసి
గర్హితం బైనయిట్టిదుష్కార్య మెత్తి, చేయుటకు రాక్షసాధమ సిగ్గు గాదె.
| 1813
|
| ఉ. |
మందిరసౌఖ్యసంపదలు మాని ధనంబుఁ బరిత్యజించి రా
జ్యేందిరఁ బాసి వెంటనె హృదీశకరచ్యుతయై మనోవ్యధం
గుందెడు పుణ్యసాధ్వి నిటు క్రూరతఁ జంపఁ గడంగి తేల యీ
యిందునిభాస్య నీకు నిపు డేమి విరోధముఁ జేసె రాక్షసా.
| 1814
|
| క. |
ఈసతిని జంపి ధర ను, ల్లాసంబున నిమిష మైన బ్రతుకఁగలే వీ
దోసమున వధ్యుఁడవు దు, ష్టాసుర మత్కరగతుండ వైతివి తలఁపన్.
| 1815
|
| ఉ. |
సాహస మొప్ప నీసుదతిఁ జంపితి వేని దురాత్మ నీవు మ
ద్భాహుహతుండవై యిచటఁ బ్రాణము గోల్పడి ఘోరయాతనా
దేహము నొంది యింతుల వధించినవారికి మౌనికోటిచే
వ్యాహృత మైనలోకమున కర్థిఁ జనం గల విప్పు డింతయున్.
| 1816
|
| క. |
అని పలికి పవనతనయుఁడు, మనమునఁ గోపంబు గదుర మర్కటయుతుఁడై
ఘనవేగంబున రావణ, తనయుపయిం జనియె బాహుదర్పం బలరన్.
| 1817
|
| క. |
విచ్చలవిడి రభసంబున, వచ్చెడుకపిసేనఁ జూచి వారించుటకుం
జెచ్చెర రాక్షససేనలఁ, బుచ్చి దశాననసుతుండు భుజశక్తిమెయిన్.
| 1818
|
| క. |
తరణికిరణసన్నిభశిత, శరశతముల నవ్వనాటసైన్యశ్రేణిన్
నుఱుమాడి హరివరుం డగు, కరువలిసుతుతోడ ననియె గర్వం బెసఁగన్.
| 1819
|
| చ. |
వనచర బ్రహ్మనందనుఁడు వాలితనూజుఁడు నీవు రాఘవుం
డినసుతుఁ డేనిమిత్తమున నిచ్చటికిం గపిసైన్యయుక్తులై
|
|