Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

నొకట మాయఁ బన్ను నొక్కెడఁ గలుషించు, నొక్కమూలఁ ద్రుళ్లు నొకట నవ్వు
విబుధవైరి యిట్లు విష్ణుపదంబునఁ, జిత్రగతిఁ జరించెఁ జిక్కు పడక.

1798


ఆ.

రాజసుతులు దైత్యరాజనందనముక్త, శరకృతక్షతాభిజాతరక్త
పూరసిక్తు లగుచుఁ బుష్పితకింశుక, భూరుహములభంగిఁ బొల్చి రపుడు.

1799


క.

ఈగతి ననన్యభేద్యుం, డై గురుతరబాహుశక్తి నసమానశరో
ద్వేగమున రాజవర్యుల, బాగుగ నెగడుపడఁ జేసి పటుశౌర్యమునన్.

1800


చ.

ధనువు రథంబు గుఱ్ఱములు తానును సారథియు న్బతాకయుం
గనఁబడకుండఁ దీవ్రగమనంబునఁ బైఁ బయి నాక్రమించి కాం
చనవలయప్రదీప్తపటుశాణశితాగ్రశరంబు లేయుచున్
బెనఁకువ మీఱవానరులఁ బీనుఁగుపెంటలఁ జేసె నెంతయున్.

1801


క.

విచ్చలవిడి నద్దైత్యుఁడు, చెచ్చెర నిగిడించునట్టి శితసాయకముల్
క్రచ్చఱఁ బిడుగులక్రియ భూ, భృచ్చరతతిమీఁదఁ బడియె భీషణభంగిన్.

1802


వ.

ఇట్లు మహాద్భుతప్రకారంబున నంతర్ధానగతుండై రణంబు సేయుచున్న శక్ర
జితునియాటోపంబుఁ జూచి సహింపక లక్ష్మణుండు సంక్రుద్ధుండై రామభద్రు
నవలోకించి యిట్లనియె.

1803


ఉ.

గర్హితవర్తనుండు దశకంఠతనూజుఁడు మాయఁ బన్ని యం
తర్హితకాయుఁడై కడుమదంబున నంబరవీథినుండి మా
నార్హుల వానరోత్తముల నంబకవిద్ధులఁ జేయుచున్నవాఁ
డర్హమె సద్గుణాఢ్య మన కార్తులఁ బ్రోవ కుపేక్ష సేయఁగన్.

1804


క.

ఆలస్య మేటి కిఁక నర, పాలమణీ యానతిమ్ము బ్రహ్మాస్త్రమునన్
నాలాయము నిఖిలాసుర, జాలంబుల గడియలోన సమయింతు ననిన్.

1805

రాముఁ డింద్రజిత్తును వధింప నిశ్చయించుట

చ.

అన విని రాముఁ డిట్లనియె నక్కట యొక్కనికై కుమార యీ
దనుజుల నెల్లఁ ద్రుంచు టది ధర్మమె నీ కది గాక భీతిమైఁ
జనియెడువాని ఛన్ను నని సల్పనివాని నిరాయుధుం బ్రమ
త్తుని శరణాగతుం గృపణుఁ ద్రుంపఁగరా దనిలోన ఱేనికిన్.

1806


ఉ.

పాయక వీని వేఱొకయుపాయమునం బరిమార్ప యత్నమున్
జేయఁగఁబోలు మిక్కిలి ప్రసిద్ధఫణాధరసన్నిభాస్త్రముల్
సాయకము న్వెసం బఱపి సాంద్రతరంబుగు గ్రమ్మి యున్న యీ
మాయ నడంగఁ జేయుదము మానక యవ్వల వీఁడు దోఁచెడిన్.

1807


ఉ.

అంతట వానరప్రవరు లద్భుతవీర్యుని క్షుద్రకర్ముఁ గా
లాంతకతుల్యు మాయికు ననంతబలాడ్యుని వీనిఁ జూచి రో
ధోంతర మెల్ల నిండ వడి నార్చుచు మ్రాకుల ఱాళ్ల వీని మే