Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తడ వేల శక్రతనయుని, బెడిదంబుగ సమరమునకుఁ బిలువుము శౌర్యం
బడరఁగఁ దాఁకుము దొల్లిటి, వడువునఁ బాఱంగ వలదు వనచరనాథా.

366


వ.

అని బోధించి మనంబుఁ గట్టి పఱిచిన నారఘువల్లభునివచనంబులు విని హేమ
పింగళుం డగుసుగ్రీవుండు క్రూరంబుగా నాకాశంబు పగుల సింహనాదంబుఁ జేసిన.

367


క.

రోషోత్థిత మగునాని, ర్ఘోషము విని కాంతిఁ దొఱఁగి గోవులు భీతి
న్ఘోషించుచుఁ బఱచె నృపతి, దోషపరామృష్ట లైన తొయ్యలులక్రియన్.

368


క.

మృగములు రణమున శ్రాంతము, లగుహయములమాడ్కి వికలతాప్తి వహించెన్
ఖగము లటు పరిక్షీణము, లగు గ్రహములకరణి నప్పు డవనిం గూలెన్.

369
ఆ.

అనిలచంచలోర్మి యగుసరిత్పరిభంగిఁ, బొంగి యాప్లవంగపుంగవుండు
నింగి పగుల నార్చి నిర్దయుఁడై శక్ర, సుతునిరాక కెదురు సూచుచుండె.

370

వాలి సింహనాదము విని రోషముతో యుద్ధమునకు వెడలుట

వ.

అప్పు డంతఃపురగతుం డగువాలి సర్వభూతప్రకంపనం బైనసుగ్రీవునికంఠనా
దంబు విని యమర్షణుండై తత్క్షణంబ మదంబు పరిత్యజించి క్రోధం బంగీకరించి
నేత్రంబులం గెంజాయ రంజిల్ల సంధ్యాతపప్రభుం డయ్యు నప్పుడు రోషపరీ
తాంగుం డగుటవలన నుపరక్తుం డగుమార్తాండునివడువున నిష్ప్రభత్వంబు
నొంది పదంపడి క్రోధంబు పెంపున దీప్తాగ్నియుంబోలెఁ దేజరిల్లుచు దంష్ట్రాకరా
ళుండై సముత్పతితపద్మంబును సమృణాళంబు నగుహ్రదంబుచందంబునం జూ
పట్టుచు శయనస్థానంబున నుండి లేచి యంతఃపురంబు వెలువడి చరణఘట్టనం
బునం బుడమి యద్రువ శీఘ్రంబునం బఱతెంచుచున్న నతనిం గౌఁగిలించుకొని
భయంబుర మనం బుదిలగొన స్నేహదర్శితసౌమనస్య యగుతార హీతోదర్కం
బగువాక్యంబున నిట్లనియె.

371


తే.

ఉదయవేళఁ దల్పంబున నుండి లేచి, పురుషుఁ డనుభూత యైనట్టిపుష్పమాల
నట్ల నీవు నదీవేగ మట్ల యరుగు, దెంచునీకోపముఁ బరిత్యజింపు మధిప.

372


తే.

అనఘచరిత ప్రాతఃకాలమందు నీవు, పో రొనర్పఁగా వచ్చును దారుణముగ
వినుతవిషయబలాబలవిషయశంక, నీమనంబున వల దింత నిక్కువంబు.

373


క.

సమయముఁ జూచినపగతుని, సమయోచిత మైనకంఠశబ్దము విని సం
భ్రమము జనియించుచున్నది, సమరంబున కిపుడు పోవఁ జనదు మహాత్మా.

374


ఆ.

విక్రమమున కిపుడు వేళ గాదు హృదీశ, సంగరమునఁ గీడు సంభవించు
వలవ దనుచు నేల వారించె దనిన న, త్తెఱఁగు విన్నవింతుఁ దెలియ వినుము.

375


ఉ.

ఇంతకు మున్ను వచ్చి హృదయేశ్వర పోరికి నిన్నుఁ బిల్చి తాఁ
గొంత రణం బొనర్చి తుది ఘోరతరం బగునీబలంబుచే
నెంతయు నొచ్చి పాఱె దివసేశ్వరనందనుఁ డట్టివాఁడు నేఁ
డింతకు నెత్తి వచ్చుటకు నేమియకో యని శంక తోఁచెడిన్.

376