| |
రామునివిజయంబునకుఁ దనపరాజయంబునకుఁ జింతించుచు శోకార్ణవమగ్నుం
డై దరి చేర నుపాయంబు లేక తిరుగుడు పడుచున్నతండ్రి నవలోకించి రాక్షస
శ్రేష్ఠుం డైనయింద్రజితుం డి ట్లనియె.
| 1568
|
ఇంద్రజిత్తు తాను యుద్ధమునకుఁ బోయెదనని రావణు నూఱడించుట
| చ. |
దనుజవరేణ్య యెవ్వఁ డరిదర్పహరం డన వన్నె కెక్కె నె
వ్వనిపటుబాణవీథిఁ బడి వాసవుఁ డైన మనంగఁ జాలఁ డా
ఘనభుజుఁ డగ్నికల్చుఁడు జగన్నుతవిక్రముఁ డింద్రజిత్తు నీ
తనయుఁడు గల్గి యుండ మదిఁ దద్దయు నీకు విచార మేటికిన్.
| 1569
|
| చ. |
నిరుపమమచ్ఛరాసనవినిర్గతబాణవికీర్ణదేహు లై
కరము గతాసు లై నిశితకాండసమాచితసర్వగాత్రు లై
దురమునఁ గూలియున్న హరితుల్యుల రాజకులప్రదీపులన్
సరసుల రామలక్ష్మణులఁ జయ్యనఁ జూచెదు నేఁ డధీశ్వరా.
| 1570
|
| ఉ. |
పౌరుషదైవయుక్త మయి పాటికి నెక్కిననాప్రతిజ్ఞ నిం
పార వినుండు తొల్లి బలయజ్ఞమున న్హరివిక్రమంబున
ట్లారయ వేల్పు లందఱు మదద్భుతవీర్యముఁ జూడ రామునిన్
వారక వానితమ్ముని నవార్యశరంబుల నేఁడు ద్రుంచెదన్.
| 1571
|
| క. |
అని పలికి యద్ధశానన, తనయుఁడు త్రిదశేంద్రరిపుఁడు దారుణసత్వం
బనువంద ఘోరతనుఁ డై, జనకునకుం జెప్పి వేగ సంగరకాంక్షన్.
| 1572
|
| చ. |
హరిరథసన్నికాశము ననర్హమణిధ్వజహేమఘంటికా
పరికలితంబు నుజ్జ్వలము పావనవేగతురంగయుక్త మ
త్యురుతర మైనదివ్యరథ ముద్ధతి నెక్కి నితాంతతేజ మం
బరమున నిండ నేగె నసమానరయంబున జన్యభూమికిన్.
| 1573
|
| శా. |
ఈరీతిం జనువానివెంట ఘనమత్తేభంబులం దేరులన్
సారాశ్వంబుల నెక్కి తోమరధనుశ్శస్త్రంబులం దాల్చి దే
వారు ల్శూరు లనేకు లేగిరి మహాహంకారు లై యాజి కిం
పార న్బృంహితనేమినాదపటుహేషారావము ల్మీఱఁగన్.
| 1574
|
ఇంద్రజిత్తు యుద్ధమునకు వెడలుట
| చ. |
పరశుగదాకృపాణములు ప్రాసపరశ్వథశూలకుంతము
ద్గరముసలంబు లుగ్రపరిఘంబులు గైకొని తత్ప్రదీప్తు లం
బరపథ మాక్రమింపఁగ నిభంబులకైవడి మత్తు లై బలా
రిరిపుపదాతు లేగిరి ధరిత్రియు మిన్నును గంప మొందఁగన్.
| 1575
|
| క. |
భేరీస్వనములు పటుశం, ఖారావము లుగ్రకాహళార్భటులు సుప
ర్వారాతులకలకలములు, దారుణగతి నొక్కభంగి దళముగ మ్రోసెన్.
| 1576
|