Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నరుదు జనింప నొంపఁ దగినట్టిభుజాబలవిక్రమాధికుం
డరయఁగ లేఁడు మత్పురమునం దొకఁడైనను నేమి సేయుదున్.

1563


చ.

అనిమిషలోకనాయకుని నాజితలంబున గెల్చి యింద్రజి
త్తనఁగఁ బొగడ్త కెక్కిన బలాఢ్యుఁడు మత్తనయుండు గోరి చే
సిన మహనీయదత్తవరచిత్రదురాసదనాగపాశబం
ధనము లొకింత యైన రఘునాయకు నొంపఁగఁ జాల వయ్యెఁగా.

1564


చ.

మఱచినఁ బోదు మోహనమొ మాయయొ మంత్రమొ సత్ప్రభావమో
నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యకి
న్నరులకు వీడరానిపటునాగశరంబులచే విముక్తు లై
సురుచిరలీల రాఘవులు సొంపుగ శోభిలుచున్నవా రొగిన్.

1565


చ.

అరుదుగ నాదుపంపున రణావని కేగినయాతుధాను లెం
దఱు గల రంద ఱాలమునఁ దప్పక చచ్చిరి గాని రామునిం
దరణికుమారలక్ష్మణయుతంబుగ నొంచి చమూసమూహము
న్వరుస వధించి మేలు గొని వచ్చినవీరునిఁ గాన మొక్కనిన్.

1566


శా.

సాహంకారత నేగి జన్యమున దేవరాతు లెవ్వానిస
ద్భాహావిక్రమసంపదం గెడసి రాధాత్రీశు నాయోధనో
త్సాహం బుజ్జ్వలదస్త్రసంపదయు దోర్దర్పంబు వీరవ్రతం
బాహా యే మనవచ్చుఁ దత్సముఁడు లేఁ డర్థిం ద్రిలోకంబులన్.

1567

రావణుఁడు జాగ్రత్తతో లంకను రక్షించుచుండుఁ డని రాక్షసుల కాజ్ఞాపించుట

వ.

అని బహుప్రకారంబులఁ గొండొకసేపు చింతించి చుట్ల నున్నరాక్షసుల నిరీ
క్షించి రామునిభయంబున నీలంక దలంకుచున్నయది మీరంద ఱప్రమత్తు లై
రక్షించుచుండవలయు నశోకవనికామధ్యంబున నెచ్చట సీత రక్షింపంబడు
చుండు నచ్చటికి నరవానరులు రాకుండ సర్వప్రకారంబులం గాచి యుండవల
యు మఱియు సర్వగుల్మంబులయందు వేర్వేఱ బలవంతు లైనదానవులు స్వసై
న్యపరివృతు లై యంతటం గాచికొనియుండువారుగా నియోగింపవలయు మన
కేమఱియుండఁదగదు ప్రదోషార్థరాత్రప్రత్యూషకాలంబులయందు వానర
బలంబుల విహారసముద్యోగస్థానంబులు నిత్యంబు నెఱుంగుచుండవలయు నని
పలికిన నద్దశగ్రీవునివచనంబు విని రాక్షసులు తద్వచనప్రకారంబున సర్వకార్యం
బులకుఁ దగువారల నియమించి రిట్లు దనుజుల కాజ్ఞాపించి రాక్షసేశ్వరుం డగు
రావణుండు నిజాలయంబు ప్రవేశించి మన్యుశల్యంబు వహించి సందీపితకోపాన
లుం డై మొగంబున దైన్యంబు దోఁప రణంబున మృతు లైనకుంభకర్ణాదిభ్రా
తల నతికాయప్రభృతికుమారులను బ్రహస్తాదిమంత్రులనుం దలంచుకొని శోక
బాష్పపరివృతలోచనుం డై మైమఱచి సారెసారెకు నిట్టూర్పులు పుచ్చుచు