Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బలమర్దనుం డగునద్దశగ్రీవుండు విబుధులచేత నుపాస్యమానుం డైనదేవేంద్రుని
చందంబునం దేజరిల్లుచుఁ బుత్రులం గౌఁగిలించుకొని సర్వాభరణభూషితులం
గావించి వీర్యవంతంబు లైనవేదమంత్రంబులచేత నాశీర్వదించి సంగ్రామంబు
నకుఁ బొండని పలికి పదంపడి తత్కుమారరక్షణార్థంబు తనతమ్ము లైనయుద్ధో
న్మత్తుం డైనమహోదరుని మత్తుం డైనమహాపార్శ్వునివెంట జంట చేసి రణం
బున కనిచిన నయ్యార్వురుయోధులు రిపురావణుం డైనరావణునకుఁ బ్రదక్షి
ణంబు చేసి యనుజ్ఞ గొని రణోత్సుకు లై గంధమాల్యాలంకృతు లై కాలచో
దితు లై సర్వాయుధపరిష్కృతు లై యాయుధప్రహారనివారకమహౌషధులు
సంగ్రహించుకొని సంగ్రామంబునకు వెడలి రప్పుడు.

1403


సీ.

నీలజీమూతంబు లీలఁ గ్రాలెడుదానిఁ గులపర్వతముమాడ్కి నలరుదాని
సకలహేతీచ్ఛటాసంకీర్ణ మగుదాని ఘనతూణయుక్త మై తనరుదాని
నైరావతకులంబునందుఁ బుట్టినదాని మదవిశేషమున మైమఱచుదానిఁ
గొండతో నైన మార్కొనఁగఁ జాలినదానిఁ గడు దీర్ఘదంతము ల్గలుగుదాని


తే.

వరసుదర్శననామకద్విరద మెక్కి, చరమగిరిశృంగగతుఁ డైనతరణిభంగి
నింగి వెలుఁగుచు రణకాంక్ష నిగుడ మృత్యు, సోదరుం డాజి కేగె మహోదరుండు.

1404


క.

ఆతని వెనుకొని రథములు, మాతంగగణంబు హయసమాజము సుభట
వ్రాతము కోలాహలసం, స్ఫీతము లై యపుడు చనియెఁ బెక్కువిధములన్.

1405


చ.

ఖరకరవాజితుల్యతురగంబులఁ బూన్చి మహామణిధ్వజం
బరుదుగ నెత్తి యాయుధచయం బిడి సజ్జ మొనర్చినట్టిసుం
దరరథ మెక్కి ధన్వి యయి తత్త్రిశిరుండు సవిద్యుదుల్కభూ
ధరగతసేంద్రచాపజలదంబువిధంబునఁ జాల నొప్పుచున్.

1406


క.

అనుపమరత్నవిరాజిత, కనకకిరీటత్రయాభికలితుం డై కాం
చనమణిశిఖరత్రయయుత, ఘనతుహినాచలముమాడ్కిఁ గ్రాలుచు నరిగెన్.

1407


క.

ఆరథికుని వెనుకొని దు, ర్వారగతిం జనియెఁ బెక్కురథములు హయము
ల్వారుణములును బదాతులు, ఘోరాయుధదీప్తి గగనగోళము మ్రింగన్.

1408


సీ.

వాసవాద్యమరు లెవ్వనిపేరు చెవికి సోఁకినయంత నభయంబునఁ జలింతు
రతిరథసమ్మతుం డితఁ డని శూరు లేధీరశేఖరునిఁ గీర్తింతు రెపుడు
నినునకుఁ గలతేజ మింద్రునకుం గలవిక్రమం బెవ్వాని విడువ కుండుఁ
గాంచనాచలసన్నికాశాతిమానోగ్రకాయ మెవ్వానికిఁ గలిగి యుండు


తే.

రాజనీతికి నెవ్వాఁడు రాయసంబు, అమితసత్త్వంబునకు నెవ్వఁ డాలవాల
మట్టిఘనకాయుఁ డతికాయుఁ డాజివిజిత, నిర్జరనికాయుఁ డీక్షించి నేర్పు మించి.

1409


సీ.

ప్రాలేయశైలంబుభంగిఁ జాల వెలుంగు మహనీయవజ్రవర్మంబు దొడిగి
నవరత్నఖచితసుందరకిరీటాంగదప్రముఖనానాభూషణములు దాల్చి