Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రణములో నేఁడు నాదుదక్షిణభుజంబు
తెగి పడియె నొంటి నే నింకఁ బగఱ నెట్లు
గెలుతు నేభంగి దేవదైత్యులఁ దలంచి
యడలు గైకొన కుందు జయంబు గొందు.

1390


క.

కాలాగ్నిగతి వెలుంగుచు, వాలాయము దేవదైత్యవర్యుల ననిలోఁ
దూలించి విక్రమంబునఁ, గ్రాలెడు నీ విపుడు పడితె రామశరమునన్.

1391


చ.

అసురవరేణ్య తొల్లి కఠినాశని వ్రేటున కించుకైన దు
ర్వ్యసనము నొందనట్టి బలవంతుని శూరుని నిన్ను నేఁడు ఘో
రసమరమందు మర్త్యుఁ డగురాఘవుఁ డొక్కశిలీముఖంబున
న్వెస వధియించెఁ గాలగతి వింతయు వచ్చె నిఁ కేమి సేయుదున్.

1392


సీ.

అద్రులఁ బిండిసేయఁగ నోపువజ్ర మెవ్వానిశిరమునకు వజ్ర మయ్యె
దనుజుల నెల్లఁ ద్రుంచిన విష్ణుచక్ర మేబలశాలి యఱుతకుఁ బతక మయ్యెఁ
బ్రజలఁ ద్రుంపఁగఁజాలురవిపుత్రుదండ మేదనుజేంద్రుమెడకుఁ బూదండ యయ్యె
నప్రతిహత మైనయలపాశిపాశ మేఘనునిబాహువుల కంగదము లయ్యె


తే.

నట్టిజయశాలి వైననీ వసురవర్య
ప్రధనమున నొక్క మర్త్యమాత్రకునిచేత
హతుఁడ వైతివి తొల్లిటి యలవు బలము
పృథుపరాక్రమపటిమ నేఁ డెందుఁ బోయె.

1393


చ.

నిహతుఁడ వైననిన్నుఁ గని నేఁడు సుపర్వులు చారణు ల్మును
ల్దహనయమేంద్రముఖ్యులు ముదంబునఁ గ్రాలుచు నున్నవార లా
గహనచరు ల్ప్రమోదకుతుకం బిగురింపఁగ లబ్ధలక్ష్యు లై
రహి నిఁక వీటిదుర్గములు ప్రాఁకఁగఁ బూనుదు రేమి సేయుదున్.

1394


తే.

చండతేజ భవద్విహీనుండ నైన, నాకు సామ్రాజ్య మేల యీనగర మేల
జీవితం బేల సిరి యేల సీత యేల, హయము లేల మదేభసంచయము లేల.

1395


ఆ.

నిన్నుఁ జంపినట్టి నృపకులతిలకుని, నాజి నేను జంపనైతి నేని
బ్రతికి యేమి ఫలము పంచత్వ మధికోద, యంబు గాదె రాక్షసావతంస.

1396


తే.

దేవకంటక యిప్పుడు నీవు పడిన
విషయమున కేను వచ్చెద విడువఁ జాలఁ
బ్రాణతుల్యుఁడ వగునిన్నుఁ బాసి ధాత్రి
నిమిష మైనను జీవింప నేర్తునయ్య.

1397


సీ.

నీవు రణంబున నిహతుండ వగుచుండఁ గనుఁగొని పూర్వాపకారి నైన
నన్నింక వేల్పులు గ్రన్నన హింసింతు రింద్రాదిరిపుల నింకెట్లు గెలుతుఁ
జతురాత్ముఁ డగువిభీషణుఁడు చెప్పినహితం బజ్ఞానమున విననైతి నపుడు