రాముఁడు గుర్తునకుఁగా సుగ్రీవునిమెడను గజపుష్పి యనులతను ధరింపఁజేయుట
| వ. |
కడచనినకార్యంబునకు వగవం బని లేదు వినుము.
| 339
|
| ఉ. |
క్రమ్మఱ ధైర్య మూఁది కపిరాజ భవద్రిపుమీఁది కీవు శీ
ఘ్రమ్మున నేగు మేను వెనుకం బటుకార్ముకబాణపాణినై
సమ్మతి నేగుదెంచి బలుచందముల న్వడిఁ బోరుచుండ నొ
క్కమ్మునఁ గూలనేసెద మహాబలశాలిని వాలి నుర్వరన్.
| 340
|
| ఉ. |
నీవును వాలియుం దొడరి నేర్పునఁ బోరుచు నుండ వీఁడు సు
గ్రీవుఁ డటంచు నిన్నుఁ బరికించుట కే నొకగు ర్తొనర్చెదన్
ధీరత దానిఁ గైకొని మదిన్ భయ మందక వైరి మీఁది కి
చ్ఛావిధిఁ బొమ్ము నావలని సంశయముం దొలఁగించి గ్రక్కునన్.
| 341
|
| వ. |
అని సుగ్రీవు నొడంబఱిచి రాముండు సౌమిత్రి నవలోకించి.
| 342
|
| చ. |
సలలితభంగి నీశిఖరిసానువుల న్శుభలక్షణాకృతిం
బొలిచిన యాప్రఫుల్లగజపుష్పిని వే కొని తెచ్చి చాల మే
ల్తలకొన నీకపీంద్రునిగళంబున నిల్పు మటంచుఁ బల్క నే
ర్పలరఁగ నాదినాధిపకులాభరణం బటు సంఘటించినన్.
| 343
|
| వ. |
ఇట్లు లక్ష్మణదత్తకుసుమాకులగజపుష్పీనామకలతాశోభితకంఠుం డై.
| 344
|
| క. |
తపనసుతుం డాలతచే, నపు డద్భుతభంగి నొప్పె నంబరవీథి
న్విపులోడుమాలచేతను, విపరీతుం డైనసూర్యువిధమున నంతన్.
| 345
|
సుగ్రీవుఁడు రామలక్ష్మణసహితుఁ డై కిష్కింధకుఁ బోవుట
| వ. |
మఱియు నాసుగ్రీవుండు బలాకామాలచేతం బొల్చుససంధ్యాభ్రంబుచందం
బున నిజదేహప్రభాపటలవిరాజమానుండై రామునియనుమతంబున వాలిపాలి
తం బైనకిష్కింధాపురంబునకుం జనియె రాముండు కాంచనభూషితం బైనదివ్య
చాపంబు సజ్యంబుఁ జేసి సూర్యసంకాశం బైనశరంబును బరిగ్రహించి ఋశ్య
మూకంబు నిర్గమించి యతనిపిఱుందం జనియె నప్పు డారామునియగ్రభాగం
బున సంహతగ్రీవుం డగుసుగ్రీవుండును శుభలక్ష్మణుం డగులక్ష్మణుండునుం
జనుచుండిరి బుద్ధిమంతుం డగుహనుమంతుండును బరాక్రమశీలుం డగునీలుం
డును బ్రశస్తబలుం డగునలుండును గీర్తివిజితతారుం డగుతారుండును బృష్ఠ
భాగంబునం జనుచుండి రిత్తెఱంగునం గూడుకొని.
| 346
|
| సీ. |
ఫలభారసన్నతోజ్జ్వలమహీరుహపుంజరంజితకుసుమితారామములును
సానునిర్ఝరగండశైలదరీఝరీబహుధాతుశోభితపర్వతములు
శీతలసలిలవీచీమాలికావృతసైకతభూషితసానువులును
వంజులకారండవమరాళసారసకోకసంఘుష్టతటాకములును
|
|
| తే. |
సలలితసుగంధికైరవోత్పలసరోజ, షండమండితరమ్యకాసారములును
మఱియుఁ దక్కినవన్యసమాజములును, వరుస నందంద చూచుచు నరిగి రపుడు.
| 347
|