| ఉ. |
అప్పుడు రాఘవుండు వడి నార్చి పెనంగెడువారి నిద్దఱం
దప్పక చూచి రూపవదనంబులు మాటలు నొక్కరీతిగా
నొప్పుచు నుండ నందుఁ బురుహూతజు నేర్పఱుపంగ లేక తా
దెప్పర మైనసాయకము ధీరత నేయక యుండె శంకచేన్.
| 330
|
| ఉ. |
అంత దినేంద్రసూతి ప్లవగాధిపుచేఁ గడు నొచ్చి డస్సి మే
నంతయు రక్తధారఁ దడియ న్రఘువీరునిఁ గాన కార్తుఁడై
చింతిలి ఋశ్యమూకగిరిచేరువ నున్నవనంబులోని క
త్యంతరయంబునం బఱచె నంగము లాతురత న్వడంకఁగన్.
| 331
|
| క. |
పఱచిన సుగ్రీవునిఁ గని, సురపతిసుతుఁ డవ్వనంబు సొరరామికి వ్రే
ల్గఱచుచు బ్రతికితి పోపో, హరితనయా యనుచుఁ బలికి యరిగెం బురికిన్.
| 332
|
| మ. |
జననాథుం డగురాముఁ డంత హనుమత్సౌమిత్రులం గూడిఁ చ
య్యన సూర్యాత్మజుఁ డున్నకానకు రయం బారంగా విచ్చేసినం
గని యాతం డొకయింత లజ్జయును శోకంబు న్విషాదంబు మో
మునఁ గన్పట్టఁగ దీనవృత్తిఁ బలికె న్భూమి న్విలోకించుచున్.
| 333
|
| క. |
విక్రమముఁ జూపి వాలి న, వక్రగతిం బిలువు మనుచు వాకొని తుది నీ
వీక్రియఁ జేయుట తగవే, చక్రేశ్వర హాని గాదె సత్యంబునకున్.
| 334
|
| క. |
ఏ నిపుడు వానిఁ దునుమఁగ, రా నని నాతోడఁ గడుఁదిరంబుగ నపుడే
మానుగ నెఱిఁగించిన న, ట్లూని కడంగుటకుఁ బోక యుండనె యేనున్.
| 335
|
| క. |
నా విని రఘునాథుఁడు సు, గ్రీవుని వీక్షించి పలికెఁ గీశాధీశా
నీ విటు నిష్టుర మాడం, గా వలవదు వినుము దానికారణ మెల్లన్.
| 336
|
రాముఁడు వాలిచే నొచ్చిన సుగ్రీవుని ననునయించుట
| వ. |
నీవును బురందరనందనుండును సమానవిక్రమంబునం బన్ని పోరునెడ నలంకారవే
వభాషాప్రమాణగతిస్వరప్రేక్షణంబు లిరువురకు సరియై యున్నకతంబున రూప
సాదృశ్యంబువలన మోహితుండనై యందు వాలి నేర్పరింపం జాలక యధిజ్య
ధన్వుండ నయ్యును జీవితాంతకరంబును ఘోరంబును శత్రునిబర్హణంబును మహా
వేగంబు నగుశరంబుఁ బ్రయోగించుటకు నుద్యుక్తుండ నయ్యును బ్రాణమిత్రుండ
వైననిన్నుం దాఁకునో యనుభయంబున శరంబు విడువ నైతి దీనం దప్పు గాఁ
గొనకుము మదజ్ఞానలాఘవంబులవలన వీరుండ వై సనీవు మద్బాణంబుచే విప
న్నుండ వగు దేని మద్బాల్యంబును మౌఢ్యంబును జగంబులందుఁ గథితంబు
గాదె దత్తాభయవధపాతకంబునకు నిష్కృతి లేదు వినుము.
| 337
|
| ఉ. |
ఇం తన నేల నన్నుఁ బ్లవగేశ్వర నా దగుబుద్ధ్యకౌశలం
బింతియె కాని వేఱొకటియే విను లక్ష్మణుఁ డేను సీతయుం
బంతముతో భవత్కృపకుఁ బాత్రుల మైతిమి గాదె నీకు మా
కింతయు భేదముం గలుగునే సచివత్వము రిత్తవోవునే.
| 338
|