Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంగ్రామంబునకుం బోవుచుఁ దనచుట్ల నున్నరాక్షసుల నిరీక్షించి పాతాళవివర
తుల్యం బైనవక్త్రంబు విచ్చి ప్రహసించుచు ని ట్లనియె.

1304


ఉ.

దానవులార యేను భుజదర్ప మెలర్ప రణంబులో బృహ
ద్భానుఁడు విక్రమించి శలభంబుల నేర్చినమాడ్కిఁ గిన్నతో
వానరముఖ్యయూథపుల వారక వ్రేల్మిడిలో దహించి య
మ్మానవనాథనందనుల మానక యిప్పుడె మ్రింగి పుచ్చెదన్.

1305


క.

ననుఁ జూచినంత శక్రా, ధ్యనిమిషపతు లడలి పఱతు రనిలో నా కీ
వనచరులఁ జంపు టది యొక, పనియే మశకములనట్లు బారి సమరనే.

1306


క.

పురరోధమునకు మూలం, బరయఁగ నరవిభుఁడు రాముఁ డతఁడు దెగిన వా
నరు లపుడె తెగినవారలు, దురమున ము న్నతనిమీఁదఁ దొడరఁగ వలయున్.

1307

కుంభకర్ణున కశుభనిమిత్తము లగుపడుట

చ.

అని యిటు రావణావరజుఁ డాడినవాక్యము లాలకించి యా
దనుజు లశంకితాత్ము లయి తద్దయు వేడ్క బహూకరించుచున్
ఘనములమాడ్కి నిష్ఠురముగా నినదంబు లొనర్చి రప్పు డా
దనుజునిమ్రోలఁ దోఁచె వితతంబుగ దారుణదుర్నిమిత్తముల్.

1308


సీ.

ఘోరంబుగా మ్రోలఁ గురిసె నెత్తురువాన కడువడిఁ బిడుగులు పడఁ దొణంగె
వననిధిశైలకాననసహితంబుగా సర్వసర్వంసహాచక్ర మడలెఁ
బెనుమంట లుమియుచు భీషణభంగిఁ గౌశికములు వాపోయె శితమహాస్త్ర
శూలంబు పై గ్రద్ద వ్రాలెఁ బక్షులు గట్టె మాటికి నపసవ్యమండలములు


తే.

భాస్కరుఁడు చాల మందగభస్తి యయ్యె
వేఁడిగాడ్పులు విసరె నవ్విబుధవైరి
యెడమకన్ను చలించె ఫణీంద్రతుల్య
భుజము కంపించె నతనిపై రజము సుడిసె.

1309


వ.

ఇట్లు సముత్థితంబు లైనరోమహర్షణమహోత్పాతంబు లవలోకించి గణింపక
కుంభకర్ణుండు కృతాంతబలచోదితుం డై యడ్డంబు వచ్చినసౌధవిమానగోపుర
ప్రాకారద్వారంబుల దాఁటుచు నగరంబు వెలువడి మహాభ్రఘనప్రఖ్యం
బై యద్భుతం బై నిండి యున్నవానరబలంబు నవలోకించి శిలోచ్చయసహి
తంబుగా సముద్రజలంబులు పొంగి పొరల నొక్కమహానాదంబు చేసిన మహా
గిరిసంకాశుం డైనకుంభకర్ణు నవలోకించి తిరస్కృతప్రళయకాలధారాధరస్తని
తం బైనతదీయకంఠనాదంబు విని వానరు లెల్ల సింగంబుఁ గన్నలేళ్లచందం
బున భయభ్రాంతులై కొందఱు వాతాహతంబు లైనమేఘంబులభంగి దశ
దిశలకుం బఱచిరి కొందఱు నికృత్తమూలంబు లగుసాలవృక్షంబులమాడ్కి
మహీతలంబునం బడి రిట్లు తనరాకకు భయంబు నొంది నానాప్రకారంబులం