Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రమ్ము దేఱ మొగంబునం దెలివి దొరకొన నిటలతటఘటితాంజలిపుటుం డై
మందమధురవాక్యంబున ని ట్లనియె.

319


సీ.

ఏమహామహునిచే నీసాలసప్తకం బొకబాణమునఁ దెగి యుర్విఁ గూలె
నట్టినీ వధిప సర్వాస్త్రకోవిదులలో నధికుఁడ వురువిక్రమాన్వితుఁడవు
నీవు కోపించిన నిర్జరులై నను బొలియుదు రొకవాలి పొలియు టెంత
యమరేంద్రతుల్యుఁడ వగునిన్ను సఖునిగాఁ బడసి యిప్పుడు గతవ్యధుఁడ నైతి


తే.

నింకఁ దడ వేల కరుణార్ద్రదృష్టి మామ, కాంజలిఁ బ్రతిగ్రహించి సమంచితముగ
భ్రాతృరూపకరిపుని విఖ్యాతబలుని, వాలిని వధించి యుపకారశీలి వగుము.

320


వ.

అని యివ్విధంబున నభ్యర్థించినఁ బ్రియదర్శనుం డగుసుగ్రీవునిఁ బరమానందం
బునం బరిష్వజించి మహాప్రాజ్ఞుం డగురాముండు లక్ష్మణునియనుమతి వడసి శుభ
వాక్యంబున ని ట్లనియె.

321

రాముననుమతిని సుగ్రీవుఁడు వాలితోఁ బోరం బోవుట

ఉ.

బంధురవిక్రమస్ఫురణ భానుజ మున్నుగ నీవు వేగ కి
ష్కింధకుఁ బోయి వాలిని బ్రసిద్ధభుజాబలశాలి వీర్యగ
ర్వాంధునిఁ బోరికిం బిలువు మవ్వల మేమును నీపిఱుంద ని
ర్మంధరవృత్తి వచ్చెద మమానుషసాహసరేఖ తోఁపఁగన్.

322


క.

హరిపతి కిటు రఘుపతి వెరు, వెఱిఁగించి కడంగి వానరేశ్వరహననా
భిరతిం జని తా నొకచో, గురుతరువులు మాటు చేసికొని యుండె రహిన్.

323


క.

సుగ్రీవుఁ డంత రాము న, నుగ్రహ మది నచ్చి గతమనోవ్యాకులుఁడై
విగ్రహరతిఁ గిష్కింధకు, నాగ్రహమునఁ జనియె శీఘ్రయానప్రౌఢిన్.

324


క.

ఈగతిఁ గిష్కింధాపురి, కేగి గగన మగలున ట్లహీనధ్వానో
ద్యోగంబు సలిపి ఘనబా, హాగర్వ మెలర్ప వాలి నాజికిఁ బిలిచెన్.

325


ఉ.

ఆరవ మాలకించి హృదయంబునఁ గోపము చెంగలింపఁ బా
కారిసుతుండు శీఘ్రమున నస్తతటంబుననుండి వచ్చునం
భోరుహమిత్రుచందమునఁ బూని జవంబున వచ్చి తాఁకె వి
స్ఫారకఠోరబాహుబల నాహసవిక్రమదుర్నివారుఁ డై.

326


క.

ఈరీతిం దలపడుటయు, శూరోత్తము లైనవాలి సుగ్రీవులకున్
ఘోరముగఁ జెల్లె మింటం, బోరు బుధాంగారకులకుఁ బోలె దుములమై.

327


క.

పిడుగులకు సాటి రాఁదగు, పిడికిటిపోటులను ఘోరభిదురముకంటె
న్బెడిదము లగుతలహతులను, వడిఁ బోరిరి మింట వృత్రవాసవులక్రియన్.

328

రాముఁడు వాలిసుగ్రీవులతారతమ్యం బెఱుంగక వితర్కించుట

వ.

ఇట్లు తార్కొని యవక్రపరాక్రమంబునం బోరుచుండ.

329