| ఉ. |
తమ్ముఁడ యేమి చెప్పు దిఁక దాశరథుం డనిలోన నిన్న క్రో
ధమ్మున నాథుజీవితము దక్కఁ గొనం దగునట్టిదారుణా
స్త్రము లనేకము ల్పఱపి దైవవశంబునఁ జంప కింటికిం
బొమ్మని దిట్ట యై విడిచి పుచ్చినఁ బ్రాణముతోడ వచ్చితిన్.
| 1230
|
రావణుఁడు తన్ను రక్షింపు మని కుంభకర్ణుని వేఁడుట
| క. |
భూపాలసుతులఁ గీశుల, నేపార వధించి వీర్య మేర్పడ నాకీ
యాపద గడవం బెట్టుట, కై పనిపడ బోధితుండ వైతివి నాచేన్.
| 1231
|
| ఆ. |
వీరవర్య బాలవృద్ధావశేషిత, యైనలంకఁ బ్రోవు మస్మదర్థ
మందు ఘోరకర్మ మాచరించి నిశాట, వంశమందుఁ గీర్తి వడయు మిపుడు.
| 1232
|
| క. |
నీ వెన్నఁడు మును నాచే, నీవిధమున నడుగఁ బడియు నెఱుఁగవు నీకున్
నావంకఁ గూర్మి గలుగుట, కీవాక్యము విని యొనర్పు మిదియె ఫల మగున్.
| 1233
|
| చ. |
అనిమిషదైత్యయుద్ధముల నద్భుతభంగి ననేకవారము
ల్దనుజుల నిర్జరోత్తములఁ దప్పక దోలి జయంబు గొన్నస
ద్వినుతబలుండ వాబలము తేజము సర్వము నేఁడు చూపు మే
మని వచియింతు నీకు సరి యైన బలాఢ్యుఁడు లేఁడు ధారుణిన్.
| 1234
|
| చ. |
అనిలుఁడు తీవ్రవేగమున నభ్రములంబలె నీవు దోర్బలం
బున విపినాటసైన్యముల భూరిరణంబునఁ బాఱఁ దోలి గ్ర
ద్దన నృపపుత్రులం దునిమి తద్దయు నాకు జయం బొసంగి గ్ర
న్నన ఘనగీర్తి నొందుము రణప్రియ మత్ప్రియబాంధవప్రియా.
| 1235
|
కుంభకర్ణుఁడు రావణునకు రాజనీతి సెప్పుట
| వ. |
అని పలికిన రాక్షసనాయకుం డగురావణునిపరిదేవితంబు విని కుంభకర్ణుండు
మనంబున గర్హించుచు నతనిం జూచి దేవా మున్ను మంత్రనిర్ణయంబునందు
మాచేత నేదోషంబు సందృష్టం బయ్యె హితులయం దనభియుక్తుండ వైన
నీచేత నాదోషంబు సమానాదితంబయ్యె దుష్కృతకరుం డగుపురుషున కెట్లు
నిరయంబులయందుఁ బతనంబు గలుగు నట్లు నీకు సీతాహరణరూపపాపకర్మ
ఫలంబు శీఘ్రంబున సంప్రాప్తం బయ్యెఁ గేవలవీర్యదర్పితుండ వైననీచేత నీ
పాపకర్మవిధానంబునకంటె ము న్నీరామాగమనలంకాదాహాదికంబును దోషో
త్పాదంబును ఫలత్వంబున నవిచారితంబులయ్యెఁ బ్రేక్షావంతుం డగుపురు
షునిచేత మొదలు విచారించి పిదపఁ గర్మం బాచరింపం దగు నది నీచేత విపరీ
తముగాఁ గృతం బయ్యె నెవ్వం డైశ్వర్యమత్తుండై పూర్వకాలకర్తవ్యకార్యం
బు లుత్తరకాలంబున నుత్తరకాలకర్తవ్యకార్యంబులు పూర్వకాలంబున నాచ
రించు నతండు నయానయజ్ఞుండు గాఁడు దేశకాలవైపరీత్యంబునఁ గృత
కర్మంబునకు దోషంబు గలుగు ననుకూలంబు లైనను గర్మంబులు స్వోచితదే
శకాలవియుక్తంబు లై క్రియమాణంబు లయ్యెనేని యశుచిజనంబులం దిడిన
|
|