Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బఱపుదునొ శక్రు ద్రుంతునో యెఱుఁగఁ జెపుఁడు
మీ రిపుడు మత్ప్రబోధనకారణంబు.

1186


వ.

అని యిట్లు సంరబ్ధుం డై పలికిన మహాబలుం డగుకుంభకర్ణునివాక్యం బాకర్ణించి
రాజసచివుం డగుయూపాక్షుండు బద్ధాంజలిపుటుం డై యి ట్లనియె.

1187

యూపాక్షుఁడు రావణునకుం బాటిల్లినయాపదను గుంభకర్ణున కెఱింగించుట

సీ.

రాక్షసనాథుండు రామునిపత్నిని మచ్చరంబునఁ జెఱఁ దెచ్చుటయును
జగతీశుపంపున నగచరుఁ డొక్కఁడు వారిధి తరియించి వచ్చి లంక
సొచ్చి జానకిఁ జూచి సురుచిరవనభంగ మొనరించి పెక్కండ్ర దనుజవరుల
ఖండించి పుర మెల్లఁ గాల్చి పోవుటయును వింటిరె కద మీరు వీరవర్యుఁ


తే.

డానరేంద్రుఁడు వానరసేనఁ గూడి
జలధి లంఘించి వచ్చి ప్రచండభంగి
లంక నరికట్టుకొని నిరాటంకమహిమఁ
గదనమున దైత్యవరులఁ బెక్కండ్రఁ దునిమె.

1188


ఉ.

పన్నగసిద్ధసాధ్యమునిపక్షిసురాసురాయక్షకోటిచే
నెన్నఁడుఁ బోరులందు భయమింత యెఱుంగనిమాకు నేఁడు వీ
ర్యోన్నతుఁడైన రాఘవనృపోత్తముచే నిటు దీర్ప రానియా
పన్నత వచ్చె మమ్ము సురభంజన చేకొని యుద్ధరింపవే.

1189


తే.

దైత్యదానవదేవసంతతులవలనఁ
బ్రథనములఁ గల్గుభయ మింత భయము గాదు
మనుజుఁ డింతకు వచ్చెఁ గ్రమంబు దప్పి
యే మనఁగ వచ్చు నాతనిదీమసంబు.

1190


క.

గిరిసన్నిభు లగుకీశులు, గురుబలముల లంకఁ జుట్టుకొని సమదగతిం
బరువడి రాత్రిచరులఁ గా, వరమున భంజించుచున్నవా రసురవరా.

1191


మ.

అరుదార న్మనవజ్రదంష్ట్రుఁడు విరూపాక్షుండునుం గృత్తశ
స్తరిపుస్తోముఁ డకంపనుం డఖిలరక్షస్సైన్యపాలుండు దు
ర్భరతేజుండు ప్రహస్తుఁడుం గెడసి రుద్యద్భాహుసత్త్వప్రశ
స్తరణాకంపితవీరవానరులచే సంగ్రామరంగంబునన్.

1192


చ.

అనిమిషసిద్ధసాధ్యపతగాహులచేతఁ బరాజయం బెఱుం
గనిదనుజేశ్వరుండు దశకంఠుఁడు నిన్న మహారణంబులో
దినకరతేజుఁ డైననరదేవునిచేఁ గడుఁ బ్రాణసంశయం
బునఁ బ్రవిముక్తుఁ డయ్యెఁ దన పూర్వభవాపద నేమి చెప్పుదున్.

1193


క.

మున్నెన్నఁ డిట్టిచోద్యము, గన్నది లే దసురవర్య కాకుత్‌స్థుఁడు మీ
యన్నను వధింపఁ దలకొని, యున్నాఁ డన్నెగులు విభున కుడుపఁగవలయున్.

1194