Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆలో దైత్యులు విక్రమించి పటుబాహాటోపు లై పావక
జ్వాలాభీలపటుస్ఫులింగపటలీసంచారఘోరంబుగా
శూలంబు ల్వడిఁ బూన్చి బిట్టలుకతో శుంభద్గతి న్వ్రేసి రా
శైలాటధ్వజినీకదంబములపై సాంద్రంబుగా నుద్ధతిన్.

910


శా.

విద్యుద్వల్లులమాడ్కిఁ దోఁకలు వియద్వీథిం బ్రకాశింపఁగాఁ
బ్రోద్యద్భాహుబలాతిరేక మడరం బొల్పొంద సంగ్రామసం
పద్యోగం బటు చూచి వేల్పులు నుతింప న్వీఁకతో రాక్షసు
ల్సద్యోమృత్యువు నొంద ఱా ల్గురిసి రాశైలాటవంశోత్తముల్.

911


ఉ.

దైత్యులు విక్రమించి పటుదర్ప మెలర్పఁగ నాక్రమించి త
త్రత్యఘనస్వనంబు బెడిదంబుగ నింగిఁ జెలంగ జన్యపాం
డిత్యము మీఱ ఘోరముగ నిష్ఠురఖడ్గము లేసి దోర్బలౌ
ద్ధత్యముఁ జూపి రప్పుడు మదం బడఁగ న్గహనాటకోటికిన్.

912


ఉ.

అక్షయబాహుశౌర్యులు దురాసదు లుగ్రభుజు ల్వనాటహ
ర్యక్షులు విక్రమంబు చెలువారఁ గృతాంతసమప్రభావు లై
దక్షత నేగి వజ్రసమదారుణశాతనఖంబుల న్వడి
న్రాక్షసకుంభిమస్తములు వ్రక్కలు వాపిరి పెక్కుభంగులన్.

913


శా.

వీరు ల్దానవు లొక్కభంగిఁ బటుదోర్వీర్యం బవార్యంబుగా
శూరత్వం బిఁక మాకు నెన్నటి కటంచుం జాల సంక్రుద్ధు లై
నారి న్వే మొఱయించి మంట లుమియ న్నానాసమానాంబకా
సారంబు న్గురియించి రుగ్రగతిఁ గీశశ్రేణిపై బల్విడిన్.

914


మ.

హరివీరు ల్గడుసాహసం బడర నుద్యద్దృప్తశార్దూలము
ల్రురుడింభంబుల నాక్రమించినక్రియ న్రోషోద్ధతి న్యామినీ
చరుల న్భీషణవైఖరిం బొదివి భాస్వత్తీక్ష్ణదంతంబులం
గర ముద్వృత్తి శిరంబులం గొఱికి వీఁకం జంపి రేపారఁగన్.

915


చ.

అసురులు భీతిఁ జెందక దురాగ్రహు లై భయదస్వనంబుతో
నసమున డాసి వజ్రకఠినాయసదీర్ఘహరిధ్వజోల్లస
న్ముసలములం గరంబుల సముత్సుకతం గొని దోర్బలంబుల
న్విసరి వనాటకోటిపయి నేర్పున వైచిరి దర్ప మేర్పడన్.

916


సీ.

కాలాయసమయోగ్రకఠినముద్గరముల విసువక పలుమఱు వ్రేసి వ్రేసి
పవిసన్నిభస్పర్శపట్టిసాయుధముల మచ్చరంబునఁ జాల గ్రుచ్చి కుచ్చి
తీక్ష్ణాగ్రకఠినోగ్రదీర్ఘకుంతంబులఁ గడువడి విడువక పొడిచి పొడిచి
కాంచనవలయసంకలితోగ్రగదలచే నుత్తలపడ వడి మొత్తి మొత్తి


తే.

భయదగతి శక్తితోమరప్రాసపరిఘ, ముద్గరపరశ్వథంబుల మోఁది మోఁది
సమదగతిఁ జండరాక్షసు ల్సంగరమున, మించి వానరబలము నొప్పించి రపుడు.

917