Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నశోకవనంబు ప్రవేశించి రామలక్ష్మణుల విజయాభ్యుదయంబు కాంక్షించుచు
సవిషాద యై శింశుపావృక్షమూలంబు నధివసించె నిక్కడ రణభూమియందు
ఘోరశరబంధబద్ధు లై మహానాగంబులభంగి నూర్పులు పుచ్చుచు నెత్తుటం
దోఁగి శరతల్పమధ్యంబునం బవ్వళించి యున్నరామలక్ష్మణులం బరివేష్టించి
మహాబలు లైనసుగ్రీవాదివానరశ్రేష్ఠులు శోకపరిప్లుతు లై బహుప్రకారం
బుల విలపించుచుండి రంతఁ గొంతసేపునకు వీర్యవంతుం డైనరాముండు శర
పాశబద్ధుం డయ్యుఁ గొండొకధైర్యంబుకలిమి స్థిరత్వంబున సత్త్వసంయోగం
బున మూర్ఛదేఱి తనపార్శ్వంబున రుధిరక్లిన్నసర్వాంగుం డై విషణ్ణుం డై
దీనవదనుం డై గాఢమూర్ఛాపారవశ్యంబునఁ బుడమిం బడియున్న సౌమిత్రి
నవలోకించి యిట్లని విలపించె.

825

రాముఁడు నేలం బడియున్న లక్ష్మణునిం జూచి విలపించుట

మ.

అకటా ప్రాణసముండు లక్ష్మణుఁడు దైత్యాస్త్రభిన్నాంగుఁడై
విశలుం డై పడి యున్నవాఁ డితఁ డిట న్వేఱొక్కలా గైన నా
కిఁక నీజానకి యేల ప్రాణములచే నిం కేమి కార్యంబు మి
న్నక సర్వంబు నితండు గాక కలదే నా కన్య మూహింపఁగన్.

826


క.

పరికింపఁగ జానకితో, సరి యగుసతి దొరకుఁ గాని జగతి నితనితో
సరి యగుతమ్ముండును సాం, పరాయికుఁడు సఖుఁడు భక్తిపరుఁడు దొరకునే.

827


క.

తనజనయిత్రిని మామక, జనయిత్రిని సమముగా విచారించు మనం
బున నింత భేదదృష్టిం, గనుఁగొనఁ డిటువంటి సుగుణి గలఁడే జగతిన్.

828


తే.

ఈగుణాఢ్యుఁడు లేనిచో నేను నిమిష, కాల మైనను జీవింపఁ గలనె సర్వ
కీశశేఖరు లటు విలోకించుచుండ, జీవితంబులు విడిచెద సిద్ధ మిపుడు.

829


సీ.

అక్కట యీసుమిత్రానందవర్ధనుఁ డట మృతుఁ డౌట యథార్థ మేని
హితమతిఁ గౌసల్య కేమని చెప్పుదుఁ గైకయీదుఃఖ మేగతి నుడువుదుఁ
బుత్రవత్సల యైనపుణ్యసాధ్వి సుమిత్ర తనయుఁ డెందున్నవాఁ డనిన నేమి
పలుకుదుఁ బదపడి భ్రాతృవత్సలు లైనభరతశత్రుఘ్నులు బంధుమిత్రు


తే.

లడుగ వారలతోడ నేమని నొడువుదు, విపినవాసం బొనర్ప నావెంట వచ్చి
నట్టితమ్మునిఁ బాసి యే నార్తితోడ, నొంటి నెబ్భంగి జనుదు నయోధ్య కిపుడు.

830


చ.

పరువడి మన్నిమిత్తముగఁ బ్రాణసమానుఁడు లక్ష్మణుండు భీ
కరతరదైత్యముక్తవిశిఖంబులచేత విభిన్నగాత్రుఁ డై
దురమునఁ గూలె గర్హితుఁడ దుష్కృతకర్ముఁడ నైతి నాకు ను
ర్వర బ్రతుకంగ నేటి కిఁకఁ బ్రాణవిమోచన మాచరించెదన్.

831


క.

మానద మును నీ వనిశము, దీనుఁడ నగునన్ను మిగులఁ దేర్పుదు విపు డా
దానవశరార్దితుఁడ నై, దీనతఁ గొని యున్ననన్నుఁ దేర్ప విదేలా.

832


తే.

కలన నెవ్వానిచే ననేకులు నిశాట, వరులు నిహతు లై సంగ్రామధరణిఁ గూలి