Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చయసంస్థితవినీలనిశాచరపరివృతం బై ద్వితీయవరణభూతయుయుద్ధసన్నద్ధమహారా
క్షసకోలాహలబహుళం బై యున్న లంకాపురంబు నవలోకించి మహామేఘంబుల
భంగి నింగి పగుల భైరవారావంబులు సేయుచు రామునిపార్శ్వంబులం
గొలిచి యుండి రంత సంధ్యాప్రతిరంజితుండై సూర్యుం డస్తమించెఁ బదంపడి
పూర్ణచంద్రప్రదీప యైనశర్వరి ప్రకాశించె నప్పుడు రాముండు వానరదానవ
నాయకు లగుసుగ్రీవవిభీషణులచేత నభినందితుం డై యూథపయూథంబులు
పరివేష్టింప లక్ష్మణసహితంబుగా నప్పర్వతపృష్ఠభాగంబున యథాసుఖంబుగా
నధివసించె నంత సూర్యోదయం బగుటయు వానరపుంగవు లందఱు దృష్టి
చిత్తాపహారిణి యైనలంక నవలోకించి జాతివిస్మయు లై తమలో ని ట్లనిరి.

621


సీ.

చందనతిందుకమందారమాకందనాగద్రుపున్నాగపూగములును
సాలహింతాలతమాలతాలంబులు కింశుకశింశుపావంశములును
శృంగారలుంగలవంగనారంగము ల్వటకుటజాశ్వత్థవిటపములును
ఖర్జూరభూర్జరీసర్జకదంబము ల్జంబీరనింబకదంబములును


తే.

రమ్యఫలయుతకుసుమితాగ్రంబులై ల, తాపరిగతంబులై సమాతతసుగంధ
బంధురములై మహోన్నతపాదపములు, వరలుచున్నవి కంటిరె పురముచుట్టు.

622


తే.

రక్తకోమలవికసితరమ్యచిత్ర, కుసుమపరిపూర్ణశాడ్వలోల్లసితచిత్ర
నీలవనవాటికలచేతఁ గ్రాలుచున్న, దీపురము చూడుఁ డక్షుల కింపు గాఁగ.

623


క.

వనవృక్షంబులు కంటిరె, పనివడి గంధాఢ్యరమ్యఫలకునుమములన్
వినుతగతిఁ దాల్చుచున్నవి, మనుజులు ఘనభూషణములమాడ్కిం బెలుచన్.

624


తే.

చారుతరకుందమందారసప్తపర్ణ
కుసుమసంసర్గసురభి యై శ్వసనుఁ డిపుడు
ఘ్రాణసుఖకారి యై పథిశ్రమము పాయ
నుడియుచున్నాఁడు విజయసంసూచకముగ.

625


శా.

ఆలోకింపఁగ నయ్యె మ్రోల నొకయుద్యానంబు సర్వర్తుకం
బై లీలాయుతషట్పదధ్వనియుతం బై రమ్యపుష్పాఢ్య మై
లోలత్కోకిలకాకలీకలిత మాలోకోత్సవాదాయి యై
యా లేఖేశ్వరకిన్నరేశ్వరమహోద్యానంబుల న్మీఱుచున్.

626

వానరులు వనంబులు సొచ్చి విహరించుట

వ.

అని బహుప్రకారంబులం గొనియాడుచుఁ గామరూపు లగుహరిపుంగవులు
సుగ్రీవుచేత ననుజ్ఞాతులై కోకిలాకులషండంబులును భృంగరాజాభిగీతంబులును
నిత్యమత్తవిహంగమంబులును సారసాభిరుతంబులును ఖంజనవిఘుష్టంబులు నగు
నమ్మహోద్యానవనోపవనంబులు సొచ్చి విచ్చలవిడి పాదవిన్యాసంబులం బుడమి
గ్రక్కదల లంకాపురం బట్టిట్టు నఱ్ఱాడ నుచ్చైర్నాదంబులు సేయుచు ఖగమృగ