Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

స్తుండు సర్వామాత్యసహితుండై దర్శనార్థియై సముపస్థితుం డయ్యె దర్శనకా
ముం డైనయతనిచేతం బ్రేషితుండ నై చనుదెంచినవాఁడ రాజభావంబువలన
భవదాజ్ఞాప్రతీక్షణాన్వితంబును బ్రయాససాధ్యంబు నగునొక్కింతకార్యంబు
గలదు గావునఁ బ్రహస్తాదులకు దర్శనం బొసంగవలయు నని పలికిన నద్దశాన
నుం డశోకవనంబు విడిచి సత్వరంబుగ మంత్రులకు దర్శనం బొసంగువాఁడై
యరిగి సభాస్థానంబున నాసీనుం డై రామవిక్రమం బెఱింగి మంత్రులతోడం
గూడి సర్వంబును బర్యాలోచనంబు సేయుచుండె రావణుండు చనిన తత్క్షణంబ
తన్మాయాకల్పితం బైనతచ్ఛిరంబును గార్ముకంబు నంతర్ధానంబు నొందె నంత
రావణుండు మంత్రులతోడ నొక్కింతసేపు మంత్రంబు గావించి కార్యంబు నిశ్చ
యించి యప్రమాదులై కార్యసాధనంబునందు సమర్థులు గం డని మంత్రు
లకుం జెప్పి సమీపవర్తు లైనహితకాములగువారి బలాధ్యక్షులం జూచి
స్ఫుటకోణవాదనదండహతం బైనభేరీనాదంబున సర్వసైన్యంబుల శీఘ్రంబున
రావింపుఁడు కర్తవ్యకార్యంబులు గావింపుఁడు స్వచ్ఛిద్రంబు లితరు లెఱుఁగ
కుండ రక్షింపుఁ డని నియమించిన వార లట్లు సేయుదు మని తమతమబలంబులం
గూర్చి యుద్ధసన్నద్ధులం జేసి తత్ప్రకారంబు సర్వంబును రావణున కెఱిం
గించి రక్కడ నశోకవనంబున రామమోహితయై దుఃఖించుచు నష్టచేతన యై
మహీతలంబునం బడి పొరలుచు నుపావృత్త యైనబడబచందంబునఁ బాంసు
పరిచ్ఛిన్నసర్వాంగియై లేచి బహుప్రకారంబుల విలపించుచున్నప్రాణప్రణ
యిని యగుజానికి నవలోకించి రావణునిపనుపున నద్దేవిని రక్షించుచున్నదగు
టంజేసి తనచేత రక్ష్యమాణ యైనసీతతోడ సఖ్యంబు వాటించి సానుక్రోశయై
దృఢవ్రతయై యున్నవిభీషణుభార్య సరమ యనునది రయంబున సీత డాయం
జని మృదుమధురవాక్యంబుల నాశ్వాసించి సఖీస్నేహంబున ని ట్లనియె.

⁠ 528


చ.⁠

నెలఁత వివేకయుక్త వగునీ కిటు శోకము నొందఁ జెల్లునే
ఖలుఁ డగురావణుండు నినుఁ గాఱియ పెట్టఁ దలంచి వచ్చుట
ల్పలుమఱుఁ గ్రూరవాక్యములు పల్కుట నీ వవి నిక్క మంచుఁ జిం
తిలుచుఁ బరిభ్రమించుటయుఁ దెల్లముగా సకలం బెఱుంగుదున్.

⁠ 529

సరమ సీతకు రాక్షసమాయలం దెలిపి ధైర్యంబుఁ జెప్పుట

తే.⁠

కువలయేక్షణ నీమీఁదికూర్మిఁ జేసి
ప్రాణ మైన నామదికిఁ బ్రియం బొనర్ప
ధనురనాథునివలనిభయంబు విడిచి
నీకు హిత మాచరించెద నెయ్య మలర.

⁠ 530


తే.⁠

రాక్షసకులాధిపుం డైనరావణుండు
యత్కృతమునందు నిష్క్రాంతుఁ డయ్యె నిపుడు

⁠