Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

అనఘచరిత బాల్యమాదిగ సహచరి, నై వ్రతానుకూల వై సుభక్తి
నిన్నుఁ గూడి యున్న నన్ను విలోకించి, పలుక వేమి తప్పు గలిగె నాకు.

517


ఉ.

కూరిమితో ననారతముఁ గోరి భజించుచుఁ గూడి యున్నన
న్నీరస నొంటి డించి దీని కేగఁగఁ జెల్లునె వహ్నిమ్రోల నీ
వారయ మద్వివాహసమయంబున నాడినమాట తప్ప కు
ర్వీరమణాగ్రగణ్య నను వేగమ దోడ్కొని పొమ్మ వచ్చెదన్.

518


తే.

అధిప నాచేఁ బరిష్వక్త మైననీదు, గాత్రము సమస్తలోకమంగళకరంబు
నేఁడు క్రవ్యాదములచేత నిక్కువముగఁ, బ్రధనతలమున భక్షింపఁబడియె నకట.

519


ఆ.

ఆప్తదక్షిణంబు లగుపౌండరీకాది, రాజసముచితాధ్వరములు నీవు
సల్పి పిదప వహ్నిసంస్కార మొంద కీ, కరణిఁ జనితి వేల ఘనగుణాఢ్య.

520


క.

వనమునకు మువ్వురము మును, చనుదెంచితి మిప్పు డొంటి సౌమిత్రి చనం
గనుఁగొని కౌసల్య మనం, బున సందేహంబు శోకముం గదురంగన్.

521


ఆ.

అతని నడిగి రాత్రి దితిజులచే నీవు, హతుఁడ వగుట దానవాలయమున
నేను రుద్ద నగుట యెఱిఁగి శోకంబునఁ, గువలయాక్షి గుండె గ్రుళ్లి చచ్చు.

522


క.

పాతకి నగునాకొఱకై, పాతకహరణుండు రామభద్రుఁడు జలధిన్
ఖ్యాతిగఁ దరించి సమర, ఖ్యాతబలుఁడు గోష్పదమున హతుఁ డయ్యెఁగదా.

523


తే.

కులముఁ జెఱుపంగఁ బుట్టిన క్రూరచిత్త
నేను బుణ్యాత్మునకు రాఘవేశ్వరునకుఁ
బత్నిగా నమ్మహాత్మునిప్రాణము గొన
జగతిఁ బుట్టిన మృత్యువ నగుట నిజము.

524


క.

ఏ నెట్టి దుష్కృతంబులు, పూనిక నజ్ఞానబుద్ధి మును చేసితినో
దానవుల చేతిలోఁ బడి, హానాథ భవద్విహీన నై మన వలసెన్.

525


వ.

మహాత్మా యేను సర్వాతిథిపూజకుండ వైననీకుఁ బత్ని నయ్యు నిప్పు డిట్టిదుః
ఖంబు నొందుటవలన నాచేతం బూర్వభవంబునందుఁ గన్యాదానంబు విదా
రితం బయ్యె నని యూహించెద నని వగచి రావణు నుద్దేశించి యి ట్లనియె.

526

సీత రావణునిఁ దనశిరంబునుం దెగవేయుమని ప్రార్థించుట

క.

రావణ పత్యనుగంనము, భావింపఁగ నతికి బరమపదసాధన మౌఁ
గావున నాతల దెగగొని, నావిభుతోఁ గూర్చి మనుపు నన్ను రయమునన్.

527


వ.

అని యిత్తెఱంగున నమ్మహీనందని రాక్షసమాయాకల్పితరామశిరశ్శరాసనం
బులు విలోకించి నిక్కం బనుబుద్ధిం జేసి దుఃఖసంతప్తయై బహుప్రకారంబుల
విలపించుచుండ నప్పు డొక్కద్వారరక్షిరాక్షసుం డద్దశగ్రీవునికడకుం జని
సముచితంబుగా సందర్శించి కృతాంజలిపుటుం డై యార్యపుత్రా విజయి వగు
మని యభివాదనంబు చేసి ప్రసాదంబు వడసి దేవా వాహినీపతి యగుప్రహ