Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణుఁడు సీతతో రాముండు హతుం డయ్యె నని చెప్పుట

వ.

అత్తెఱం గెట్లనిన వినుము.

496


సీ.

వనజాక్షి నీభర్త నను రణంబునఁ జంపి వడి నిన్నుఁ గొనిపోవువాంఛఁ జేసి
వానరేంద్రప్రణీతానంతకపిబలపరివృతుం డై నదీపతిఁ దరించి
రవి గ్రుంకునప్పు డర్ణవయామ్యతటగతం బైనసువేలాద్రియందు విడిసి
బడలి పథిశ్రమ పాయుట కచ్చోట నంచితభంగి నిద్రించి యుండ


తే.

నే నతనిరాక విని కడుహితులఁ జరులఁ
బనిచి రామునిచందంబు బలవిధంబు
సర్వము నెఱింగి నడురాత్రిసమయమందుఁ
దద్వధోపాయ మాత్మలోఁ దలఁచి చూచి.

497


వ.

మహాబలుం డగుమత్సేనాబతిఁ బ్రహస్తుని బలాన్వితుం జేసి రామలక్ష్మణసహి
తంబుగా వానరుల వధించి రమ్మని యనిచిన నతండు మత్ప్రచోదితుం డై నిశా
సమయంబున సుఖసుప్తం బైనవానరబలంబు సొచ్చి కాలాయసమయంబు
లైన పరిఘపట్టిసప్రాసఖడ్గదండయష్టిశూలకూటముద్గరశక్తితోమరచక్రముసలశర
భిండివాలంబులు బ్రయోగించి యులూకంబులు వాయసంబులుంబోలె వాన
రుల వధించి ప్లవగాధిపుం డగుసుగ్రీవుని భగ్నగ్రీవునింజేసి చంపి హనుమంతుని
నిరస్తహనునిం జేసి వధించి కుఠారంబుచేతఁ బాదపంబుంబోలె జాంబవంతుని
జానుకూర్పరముష్టిఘాతంబులఁ బుడమిం ద్రెళ్లవైచి వానరశ్రేష్ఠు లగుమైందద్వి
విదులు నిద్దఱ రుధిరసముక్షితాంగులం జేసి పంచత్వంబు నొందించె మఱియు
రాక్షనప్రయుక్తమహాసిపరిచ్ఛిన్నకంఠుండై పనసుండు పనసతరువుపోలిక మేదినిం
బడియె బహునారాచసంఛిన్నుండై వలీముఖుండు దరీముఖంబునం బడియె
సాయకాభిహతుండై కుముదుండు కుముదంబుపగిది నేలం గూలె దానవఖడ్గ
ధారాహతుం డై శరభుండు శరభంబుచాడ్పునఁ గెడసె నొక్కింతసేపు రాక్ష
సులతోడం బెనంగి యలసి తదీయశరజాలహతుం డై మేనం గ్రొత్తనెత్తురు
గ్రమ్ముదేఱ నంగదుండు క్షితిపతితాంగుం డై మడిసె గజరథతురగపదాతులచేతఁ
బ్రమథితశరీరులై కొందఱు వాయువేగహతంబు లైనమేఘంబులమాడ్కిఁ
గొందఱు సింహాభిన్నంబు లైనగజంబులభంగిఁ గొందఱు వ్యాఘోపద్రు
తంబు లైనలేళ్లకరణి భయవిత్రస్తులై పఱచి కొందఱు సముద్రంబునం బడిరి
కొందఱు గగనంబునకు దాఁటిరి కొందఱు వృక్షంబు లెక్కిరి కొందఱు సాగ
రానూపగిరివనంబుల డాఁగిరి కొండఱు భయంబునం బరువెత్తం గాళ్లు రాక
చిక్కి మడిసిరి విభీషణుండు బద్ధుం డయ్యె లక్ష్మణుండు కతిపయవానరులం
గూడి పలాయితుం డయ్యె నప్పుడు ప్రమాథి యగు ప్రహస్తుండు.

498


ఆ.

సునిశితాసిచేత సుఖసుప్తుఁ డగునీదు, విభునిశిరముఁ ద్రుంచి వెస వధించె
రక్తసిక్త మైన రామునిశీర్షంబుఁ, జూడు మిదిగొఁ దెచ్చి చూపువాఁడ.

499