Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తుండై మౌనంబు ధరియించి యప్రమాదుండై విధ్యుక్తప్రకారంబున నమ్మ
హోదధి నుపాసించుచుండ నమ్మహనీయచరిత్రునకు నిశాత్రయం బతిక్ర
మించె నంత.

436

సముద్రుఁడు పరీక్షార్థంబు రాము నుపేక్షించుట

మ.

నయవిచ్ఛేఖరుఁ డైనరాఘవునిచే నానాప్రకారంబుల
న్నియతిం బ్రార్థితుఁ డయ్యు మై మఱచి మున్నీ రమ్మహాభర్తకుం
బ్రియ మారం బొడసూప కుండె జడధు ల్విఖ్యాతదండక్రియా
నియతిం గాక ప్రశాంతవాక్యముల నన్వేషింపఁగా నేర్తురే.

437


వ.

మఱియుఁ దనకు విరోధు లగుమరువాసుల రామునిచేత దండింపంజేయుటకును
రావణునిభయంబునఁ దత్సంహారక్షమం బైనరామునిపరాక్రమంబు పరీక్షించు
టకును సముద్రుండు విలంబనంబుఁ జేసి పొడసూపకుండె.

438


తే.

ఉదధి యీరీతిఁ బొడసూపకున్న నలిగి
మనుజపతి నేత్రములు నెఱ్ఱఁదనము గదుర
నంతకాకారుఁ డై తనచెంత నున్న
యట్టిసౌమిత్రిఁ గనుఁగొని యిట్టు లనియె.

439


చ.

అనఘచరిత్ర కంధిదురహంకృతిఁ గంటివె డాయ రాఁడు నే
ర్పును బ్రియవాగ్విశేషతయుఁ బొల్పుగ శాంతిశమక్షమార్జవా
ద్యనుపమసద్గుణంబులు దురాత్ములకుం బని సేయ వట్టిస
జ్జనుఁ గని సాధునిందితు లశక్తుఁ డటంచుఁ దలంతు రెంతయున్.

440


తే.

సర్వదోత్సృష్టదండునిఁ జపలు విపరి, ధావకుని దృప్తు దుష్టునిఁ దన్నుఁ దాను
బొగడుకొనువాని దుర్నీతి నెగడువాని, శకునిఁ గనుఁగొని లోకంబు సత్కరించు.

441


క.

సామమునఁ గీర్తి గలుగదు, సామంబున యశము లేదు సజ్జనుఁ డైనన్
సామమున ఖ్యాతి వడయఁ డ, సామంబున నెల్లపనులు సమకొని వచ్చున్.

442


క.

నిరుపమనిశాతమద్భీ, కరశరనిర్భిన్నమకరకమఠంబులచే
శరనిధి నిరుద్ధసలిలో, త్కరముగఁ గావింతు నిపుడు గనుఁగొను మనఘా.

443


క.

పన్నుగ దంతికరంబులు, పన్నుగ భోగములు కచ్ఛపంబులశిరముల్
క్రన్నన మత్సాయకసం, ఛిన్నము లై పోవునట్లు చేసెదఁ గడిమిన్.

444


క.

సమదేభమీనకర్కట, కమఠంబు సశంఖశుక్తికాజాలము ను
గ్రమహోరగసేవిత మగు, కమలధి నింకింతు నీవు గనుఁగొనుచుండన్.

445


తే.

దశరథకుమార నాయందుఁ దాల్మియునికిఁ
జేసి జలనిధి చుల్కన చేసి నన్నుఁ
గడిమి నసమర్థునిఁగఁ జూచెఁ గావరంపు
జనులయెడ నోర్పు యుక్తమై తనరదయ్య.

446