రాముఁడు సీతాదేవియాభరణంబుల లక్ష్మణునికిఁ జూపుట
| వ. |
ఇట్లు ప్రియాభరణసందర్శనసంజాతశోకమూర్ఛాపారవశ్యంబునఁ బుడమింబడి
కొండొకసేపునకు లబ్ధసంజ్ఞుం డై బిలస్థం బగుపన్నగంబుచందంబున రోఁజుచుఁ
బాష్పపూరితముఖుం డై దుఃఖించుచున్న సౌమిత్రి నవలోకించి.
| 205
|
| మ. |
జననాథాత్మజకంటె భూమిసుతచే సంత్యక్త మైనట్టినూ
తనదివ్యాభరణంబులు న్విమలచిత్రక్షౌమచేలంబు న
ద్దనుజుండే కొనిపోవుచో గుఱుతుగాఁ దన్వంగిమైసొమ్ము లీ
ఘనశైలంబునఁ బాఱవైచి చనె నిక్కం బింత చింతింపఁగన్.
| 206
|
| వ. |
మఱియు నీయనర్ఘరత్నాభరణంబులు హరితతృణవంతం బైనమృదుమహీస్థలం
బున నుత్సృష్టంబు లగుటం జేసి యవికలరూపంబులై యున్నవి విలోకింపుము.
| 207
|
| క. |
నరవరసుత యీసొమ్ములు, గుఱు తెఱుఁగుదె యనిన నతఁడు గూరినశోక
స్ఫురణము మీఱఁగ నద్దిన, కరవంశాంభోధిచంద్రుఁ గని యి ట్లనియెన్.
| 208
|
| తే. |
అధిప యీకమనీయరత్నాంగదములు, నీరుచిరకుండలంబులు నే నెఱుంగ
ననవరతము బాదాభివందనమువలనఁ, బదకటకనూపురము లెఱుంగుదు మహాత్మ.
| 209
|
| ఉ. |
నా విని రాఘవుండును మనంబున మోహము నివ్వటిల్ల సు
గ్రీవునిఁ జూచి నీ వెచటఁ బృథ్వీసుతం గనుఁగొంటి నప్పు డా
రావణుఁ డెందుఁబోయెఁ గపిరాజ తదీయనివాస మెద్ది వాఁ
డేవిధి సంచరించుఁ జల మెంత బలం బది యెంత చెప్పుమా.
| 210
|
| ఉ. |
దోష మటంచు నించుకయుఁ దోఁవక దైత్యుఁ డపాంసులాశిరో
భూషణ మైనజానకిని మ్రుచ్చిలి చేకొని యేఁగె వాఁడు మ
ద్రోషమున న్సమస్తజనదూషితుఁ డై త్రుటిలోన నింక ని
శ్శేషముగా నశించు హరిశేఖర యెంతబలంబు గల్గినన్.
| 211
|
| తే. |
అనఘచరిత మద్భార్యాపహారి యైన, రిపునిఁ బేర్కొను మిప్పుడె విపులవిశిఖ
దహనహేతుల వాని నిర్దగ్ధుఁ జేసి, సత్వరంబుగఁ బంపెద శమనపురికి.
| 212
|
సుగ్రీవుఁడు రామునితో రావణునివాసాదికంబు తా నెఱుంగ నని చెప్పుట
| వ. |
వానరేంద్రా యేను దన్నిమిత్తంబున సర్వరాక్షసనాశంబుఁ గావించెద నద్దు
రాత్ముండు సీతను మ్రుచ్చిలి నాకును మహారోషంబు గలిగించి తనజీవితాంతం
బుకొఱకుఁ దానే మృత్యుద్వారంబుఁ దెఱచికొనియెనని యిట్లు పరమార్తుం
డై పలికిన రామునివచనంబు విని సుగ్రీవుం డొక్కింతసేపు తనలోన విచారించి
యీరాముండు మిక్కిలి వ్యసని యై యున్నవాఁ డేను రావణునినివాసంబును
దత్పరాక్రమాదికంబు నెఱుంగుదు నని యంటి నేని యిప్పుడే రావణవధా
ర్థంబు ప్రయత్నంబు గావింపుద మని పలుకు వానరబలంబులం గూర్చి గాని
సీతాన్వేషణ రావణవధాదికంబు గావించుట శక్యంబై యుండదు వాలి రాజై
|
|