Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అగచరోత్తమ యీమహామహుఁ డిక్ష్వాకువంశజాతుఁడు గురువత్సలుండు
దశరథతనయుండు ధర్మసంవేదియు నమితవిక్రముఁడు రామాభిధానుఁ
డనఘాత్ముఁ డగుతండ్రిపనుపున వనమున కరుదెంచి రావణాసురునిచేత
నాలిఁ గోల్పడి శరణార్థి యై నినుఁ గాన వచ్చినాఁ డీతఁ డెవ్వానిచేత


తే.

వసుధ సత్యంబుచేతఁ గావంగఁబడియె, నశ్వమేధశతం బెవ్వఁ డాచరించె
నట్టిదశరథునకుఁ బుత్రుఁడగు నితండు, నీకు శరణాగతుం డయ్యె నెలఁతకతన.

178


క.

నీతో సఖ్యము సేయఁగ, నాతురత న్వచ్చినట్టియలఘుల వీరి
న్ఖ్యాతిగఁ జేకొని కడుసం, ప్రీతులఁగాఁ జేయు మిపుడు వివిధార్చనలన్.

179


ఉ.

నా విని వాయుపుత్రువచనంబుల కెంతయు సంతసిల్లి సు
గ్రీవుఁడు శోకము న్భయముఁ గిల్బిషశంకఁ బరిత్యజించి సు
శ్రీ విలసిల్ల మానవశరీరముఁ దాల్చి రఘుప్రవీరు సం
భావితుఁ జేసి యిట్లనియెఁ బల్కులఁ దేనియ గ్రమ్ముదేరఁగన్.

180


క.

ధర్మవినీతుఁడ వనియును, నిర్మలమతి వనియు నేఁడు నీగుణములు స
త్కర్ముఁ డగువాయుసుతుచే, నర్మిలి సంబోధికంబు లయ్యె మహాత్మా.

181


క.

నగచరుఁడ నైననాతో, జగతీవర నీవు సఖ్యసంబంధ మొన
ర్పఁగఁ గోరినకతమున నా, కగణితసౌభాగ్యలాభ మది యబ్బె గదా.

182


క.

భూమిశ నీకు సఖ్యం, బీమెయి నాతో నొనర్ప నిష్టమె యేని
న్జే ముట్టి బాస సేయుము, నామది సంశయము విడిచి నమ్మెద నధిపా.

183


క.

నా విని తనకరమున సు, గ్రీవునిహస్తంబుఁ బట్టి కీశోత్తము నీ
తో వదలక సాచివ్యము, గావించితి ననుచు విభుఁడు గ్రక్కునఁ బలికెన్.

184

శ్రీరామసుగ్రీవులు పరస్పర మగ్నిసాక్షికంబుగా సఖ్యము సేయుట

చ.

పవనజుఁ డంత శీఘ్రమునఁ బావకునిం బ్రణయించి తెచ్చిన
న్వివిధసపర్య లిచ్చి కడువేడ్కఁ బ్రదక్షిణ మాచరించి యా
రవితనుజుండు రాముఁడూ పరస్పరవక్త్రవిలోకనంబుల
న్దవిలి కృశానుసమ్ముఖమున న్సచివత్వ మొనర్చి రిర్వురున్.

185


ఉ.

అప్పుడు రాఘవుండు ప్లవగాధిపునిం గరుణార్ద్రదృష్టుల
న్దప్పక చూచి నీ విపుడు నాకు వయస్యుఁడ వైతి గాన నిం
కెప్పుడు దుఃఖము న్సుఖము నిర్వురకు న్సరిగాఁ దలంచి యి
ట్లొప్పిన స్నేహభావమున నుండుదు మీశిఖి సాక్షిగా నిలన్.

186


చ.

అన విని సంతసిల్లి ప్లవగాధిపుఁ డొక్కవిశాలసాలశా
ఖను బెకలించి తెచ్చి యొకగండశిలాఫలకంబుమీఁద గొ
బ్బున మృదురీతిగాఁ బఱిచి భూధవుతోడ సుఖోపవిష్టుఁ డై
తనమది నుబ్బుచుండె వితతంబుగ ముజ్జగ మబ్బినట్లుగన్.

187