| |
నగురక్షోవీరులు కొందఱు భవన్నియోగంబున మానుషరూపధరులై రాముని
యొద్దకుం జని భయంబు వదలి యతనితో భవత్సోదరుం డగుభరతుండు
పంప వచ్చినవార మమ్మహీరమణుండు చతురంగబలపరివృతుండై శీఘ్రంబున
నెత్తివచ్చుచున్న వాఁడని యెఱింగించువారుగా సంఘటింపు మంత శక్తిశూల
గదాచాపబాణాసీహస్తులమై మన మందఱము రయంబునం జని గగనంబున
నుండి నిఖిలాస్త్రశస్త్రవర్షంబున హరివాహినిం బరిమార్చి యమక్షయంబున
కుం బుచ్చెద మట్లైన రామలక్ష్మణులును విధ్వస్తసహాయులై మనకు వశ్యులగు
దు రట్లుగా కొక్కింత పెనంగిన నశ్రమంబున నిర్దింపవచ్చు నని పలుక నప్పుడు
కుంభకర్ణనందనుండు కుంభుం డనువాఁడు వీర్యదర్పంబున నధికుండగువాఁడు
కోపోద్దీపితముఖుండై రావణుండు వినుచుండ రాక్షసుల నవలోకించి యి ట్లనియె.
| 153
|
కుంభనికుంభాదిరాక్షసులు రావణునకుఁ దమయభిప్రాయముఁ దెల్పుట
| ఆ. |
ఇంద ఱిన్ని పలుక నేల మీ రందఱు, నిప్పురమున నుండుఁ డే నొకండ
యరిగి రామలక్ష్మణార్కజానిలనంద, నాదికపుల నెల్ల నడఁచి వత్తు.
| 154
|
| క. |
అని పలుకుచుండ నపు డ, య్యనిమిషరిపుతోడ వజ్రహనుఁ డనుదైత్యుం
డను ఘనకోపవిశేషం, బున నధరోష్ఠము చలింప బొమలు ముడివడన్.
| 155
|
| చ. |
అడిచి పడంగ నేటి కిపు డందఱు వారుణి గ్రోలి యిండ్లసం
దడిబడి యాటపాటల గతవ్యథు లై సుఖవృత్తి నుండుఁ డే
నుడుగక నొక్కరుండ చని యుద్ధతిఁ గీశుల నెల్ల మ్రింగి నే
ర్పడరఁగ రామలక్ష్మణుల నర్కసుతు న్వధియించి వచ్చెదన్.
| 156
|
| వ. |
అని యిట్లు పెక్కండ్రు పెక్కుతెఱంగులఁ దమతమపేరు వాడి పంతంబు లాడి
గుమిగూడి.
| 157
|
| సీ. |
సూర్యశత్రుండును సుప్తఘ్నుండును యజ్ఞకోపుండు కుంభనికుంభు లగ్ని
కేతుండు నలరశ్మికేతుండు రభసుండు నాప్రహస్తుండు దేవాంతకుండు
ధూమ్రాక్షయూపాక్షదుర్ముఖమురాక్షు లావిరూపాక్షనరాంతకులును
దాపసాంతకమహోదరమహాపార్శ్వులు సర్పరోముండును శక్రజిత్తు
|
|
| తే. |
మొదలుగాఁ గల్గు దారుణత్రిదశరిపులు
దుష్ప్రధర్షులు బలయుతు ల్ధుర్నివారు
లగ్నికల్పులు కులకుధరాభదేహు
లొక్కకార్యంబునకుఁ బూని యుక్కు మిగిలి.
| 158
|
| చ. |
పరశుగదాసికుంతములు ప్రాసపరశ్వథభిండివాలము
ద్గరముసలంబు లుగ్రపరిఘంబులు పట్టిసశక్తిశూలము
ల్శరములు కార్ముకంబులు తళత్తళ నంబరవీథిఁ బర్వఁగాఁ
గరములఁ బూని లేచి దశకంఠునిముంగల నిల్చి యుద్ధతిన్.
| 159
|