రావణుఁడు సభ్యుల కుత్తమమధ్యమాధమమంత్రకర్తలఁ దెల్పుట
| తే. |
తలఁప నుత్తమమధ్యమాధము లనంగఁ
గలరు మువ్వురు నరులు జగంబునందు
వారిలోపల గుణదోషవర్ణనంబు
లేర్పరించెద వినుఁడు మీ రింపు మెఱసి.
| 120
|
| చ. |
హితమతు లైనచుట్టల సహిష్ణుల మిత్రుల మంత్రనిర్ణయో
చితమతు లైనమంత్రుల నశేషనయజ్ఞులఁ గూర్చి మంత్ర ము
ద్ధతి నొనరించి భారమును దైవముపై నిడి కార్యయత్నముం
జతురతఁ జేయు నప్పురుషసత్తముఁ డుత్తముఁ డండ్రు ధార్మికుల్.
| 121
|
| క. |
తా నొకరుం డేధర్మం, బే నెఱి యని నిశ్చయించి హితమంత్రులతోఁ
బూని వచింపక కార్యము, మానుగఁ గావించువాఁడు మధ్యముఁ డుర్విన్.
| 122
|
| క. |
గురుమతి గుణదోషంబుల, నరయక దైవవ్యపాశ్రయము విడిచి పను
ల్వెరవునఁ దీర్చెద నని యు, ర్వరలోన నుపేక్ష సేయువాఁ డధముఁ డగున్.
| 123
|
| తే. |
మనుజు లెబ్బంగి నుత్తమమధ్యమాధ
మాభిధానంబులు వహింతు రవ్విధమున
మంత్రములు ధాత్రి నుత్తమమధ్యమాధ
మాఖ్యలు వహించు నది యెట్టు లనిన వినుఁడు.
| 124
|
| తే. |
ధర్మరతు లైనమంత్రిసత్తములఁ గూడి
శాస్త్రసందృష్ట మైనలోచనముచేత
నైకమత్యంబు నొంది నిత్యంబుఁ జేయు
నట్టిమంత్రంబు నుత్తమ మండ్రు బుధులు.
| 125
|
| తే. |
మచ్చరంబున నొండొరు మెచ్చ కర్థ
నిర్ణయమునందు బహుమతినిరతి నొంది
మరల నైక్యంబు గల్గి నిష్ఠురతఁ జేయు
నట్టిమంత్రంబు మధ్యమ మనఁగఁ బరఁగు.
| 126
|
| క. |
హిత మెఱుఁగక తమతమదు, ర్మతములె సిద్ధాంత మని పరస్పర మైక్య
స్థితి గలుగకుండ నిచ్ఛా, గతిఁ జేసెడుమంత్ర ముర్విఁ గడునధమ మగున్.
| 127
|
| ఉ. |
కావున మీరు సాధుగతిఁ గార్యవిచారముఁ జేసి యిమ్మెయి
న్బోవ జయంబు గల్గు నని బుద్ధికొలంది యెఱుంగఁ బల్కుఁ డు
ర్వీవరుఁ డర్థనిర్ణయవివేకసమన్వితమంత్రివాక్యసం
భావితుఁ డై వెలుంగుట క్షపాచరులార సునీతియే కదా.
| 128
|
| సీ. |
రాముండు సుగ్రీవసౌమిత్రిసహితుఁ డై వీరవానరసైన్యవితతి గొలువ
నంబుధి నేయుపాయంబున నైన బల్విడి దాఁటి దోహలం బడర లంక
|
|