| |
యురమున సోఁకఁగ నెప్పుడు, కర మరుదుగ జనకపుత్రి కౌఁగిటఁ జేర్చున్.
| 110
|
| తే. |
గాలిచే నీలఘనములు దూలి పోవఁ, గ్రాలు శారదశిశిరేఖకరణి నాదు
బాణరయమున దైత్యులు పాఱిపోవ, సీత నామ్రోల నెపుడు భాసిల్లు ననఘ.
| 111
|
| క. |
ఎప్పుడు దైత్యునియురమున, నొప్పుగ ఘోరాస్త్రచయము లునిచి ప్రమోదం
బుప్పతిల జనకనందనిఁ దప్పక కైకొందు శోకతాపము దీఱన్.
| 112
|
| క. |
పరమపతివ్రత యగున, త్తరుణి మహోత్కంఠతోడఁ దప్పక నన్నుం
బరిరంభించుచు నప్పుడు, సరసత నానందబాష్పజలములు నించున్.
| 113
|
| ఆ. |
జానకీవియోగజనితశోకంబు శు, క్లేతరాంబరంబురీతి నెపుడు
విడుచువాఁడ నధికవిఖ్యాతసత్కీర్తి, నొందువాఁడ సౌఖ్య మొందువాఁడ.
| 114
|
| మ. |
జనకోర్వీపతికూఁతు రాదశరథక్ష్మానాథవంశాబ్ధిచం
ద్రునకుం గోడలు నాదుపత్ని సుజనస్తోత్రార్హ దుష్టాసురీ
జనమధ్యంబునఁ జిక్కి యాత్మపరిరక్షాదక్షునిం గాన కా
ర్తిని శోకించుచు నుండు టెట్లు విధి యుక్తిం ద్రోవఁగా నల్పమే.
| 115
|
| తే. |
పార్థివోత్తమతనయ స్వభావతన్వి, గాన ననశనదుఃఖశోకములచేత
నేఁడు తలపోయ మిక్కిలి వాడి యుండుఁ, బద్మముఖి దేశకాలవిపర్యయమున.
| 116
|
| వ. |
అని యిట్టు లారఘువల్లభుండు మదనోద్దీపనకరసముద్రవేలావనవిలోకనంబువలన
సముత్పన్నం బైనవిరహవేగంబు సహింపంజాలక సీత నుద్దేశించి బహుప్రకా
రంబుల విలపించుచుండఁ దదీయవిరహతాపంబుఁ జూడలేనివాఁడుపోలె భా
స్కరుండు మందరశ్మి యై చరమశిఖరిశిఖరాంతరంబున నస్తమించె నప్పుడు
రాముండు సంధ్య నుపాసించి వెండియు మనోహారిణి యగుజానకిం దలంచు
కొని సంతాపించుచు నుచితప్రవర్తనంబుల నుండె నట లంకాపురంబున రాక్ష
సేశ్వరుం డగురావణుండు భయావహం బైనహనుమంతునియద్భుతకర్మంబు
విలోకించి రాక్షసుల నందు రావించి సిగ్గుపెంపున నొక్కింత మొగంబు
వాంచి యెల్లవారును విన నిట్లనియె.
| 117
|
రావణుఁడు సభ్యుల రావించి యాలోచించుట
| ఉ. |
వానరమాత్రుఁ డొక్కఁ డనివార్యగతిం జనుదెంచి జానకి
న్మానుగఁ గాంచి లోపలివనం బది భగ్నము చేసి కొందఱ
న్దానవవీరులం దునిమి తప్పక లంకను బాడుఁజేసి యం
భోనిధి నిస్తరించి యటు పోవుట యంతయుఁ గంటిరే కదా.
| 118
|
| ఉ. |
ఏమి యొనర్తు మింక మన కెయ్యెది భద్రము యుక్త మెద్ది నా
కేమిటఁ జేకుఱు న్విజయ మింతయుఁ జెప్పుఁడు నాకు మీరు సం
గ్రామజయంబు మంత్రమునఁ గల్గు నిజం బని రాజనీతి వి
ద్యామహిమాధికు ల్పలికి రప్పని తప్పక సేయుఁ డిత్తఱిన్.
| 119
|