Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

భూపవరేణ్య సదీపతి యగుసముద్రుని దాటుటకు సూక్ష్మబుద్ధిచేత
నస్మదాదులఁ గూడి యాలోచనము సేయు మట్లైన నీకపు లధికబలులు
కామరూపులు శిలాకాండపాదపవృష్టి నరుల నిర్జించెద రాజిలోనఁ
బగతునివాస మెప్పాటఁ గన్పట్టునో యని యున్నవార మయ్యనువు మాకు


తే.

దొరకొనియెనేని రిపుఁడు సంగరమునందుఁ
జచ్చుటకు లేద యొక్కింత సందియంబు
చిత్త మిగురొత్తఁ గంటె నిమిత్తములను
వేయి యేటికి నిక్కంబు విజయ మొదవు.

32


వ.

కావున నీవు శోకంబు దక్కి విజయమూలం బైనక్రోధం బవలంబింపు మని పలి
కినఁ బరమార్థవిదుం డగురాముండు హేతుమంతంబు లైనసుగ్రీవునిపలుకులు
ప్రతిగ్రహించి హనుమంతు నవలోకించి కపీంద్రా తపోబలవిశేషంబున నైన సేతు
బంధంబు గావించి యైన శరంబులు శోషింపఁ జేసియైన నెత్తెఱంగుననైన సము
ద్రలంఘనంబునందు సమర్థుండ నైతి నది యట్లుండనిమ్ము పరుల కగమ్యంబైన
లంకాపురప్రకారం బెట్టిది యంజలిజలగిరివనస్థలాత్మకంబు లైనదుర్గంబులును
బలపరిమాణంబును ద్వారంబులయందుఁ గీలఖననపరిఘయంత్రవిశేషకరణా
దికదుర్గక్రియయును బ్రాకారాట్టాలకాదినిర్మాణంబును గృహరచనావిశేషం
బులును మఱియునుం గలమహిమ లెల్ల వినం గుతూహలం బగుచున్నది నీవు
ప్రత్యక్షంబుగాఁ జూచి వచ్చి నంతయు విస్త్రబ్ధంబుగా నెఱింగింపుము.

33

హనుమంతుఁడు రామునకు లంకాపురసన్నివేశం బెఱింగించుట

క.

నా విని హనుమంతుఁడు రఘు, భూవల్లభుతోడ వాగ్విభూతి దలిర్పన్
రావణభుజపాలితలం, కావిభవస్ఫురణ దెలియఁగా ని ట్లనియెన్.

34


చ.

దనుజవరేణ్యుచందమును దత్పృథుతేజము నాశ్రయించి దై
త్యనివర మున్నభంగియు బలౌఘవిభాగము దుర్గకౌశలం
బును మఱి గుప్తికర్మమును బొల్పుగ ద్వారవిశేషవైఖరి
న్జననుత చిత్తగింపు మిఁక సర్వము నేర్పడ విన్నవించెదన్.

35


చ.

తొలుత శతాంగవేగమునఁ దోఁచినధూళి మదేభవారిదో
చ్చలితసుగంధిసాంద్రమదధారలచేఁ దడియం దురంగము
ల్దళముగఁ బర్వి చిత్రగతుల న్నటియింపఁ బదాతు లెల్లెడం
గలసి చరింప నప్పురము గ్రాలు సురాసురదుష్ప్రధర్ష మై.

36


వ.

మఱియును.

37


చ.

అరుల కభేద్య మై తనరు నంబుధిదక్షిణతీరమందు సు
స్థిరముగ నాత్రికూటగిరిశృంగముమీఁద విచిత్రశిల్పివి
స్ఫురణ దలిర్ప దానిఁ గడుఁబుణ్యచరిత్రుఁడు విశ్వకర్మ ము
న్గరిమ సృజించె దేవపురికంటె విశేషము గల్గునట్లుగన్.

38