Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కపివర్య జానకిఁ గాంచి వచ్చుటఁ జేసి మదికి నత్యంతసమ్మదము గల్గె
నైనను దుష్పార మగుమహోదధి నెట్లు దాఁటి తద్దక్షిణతటముఁ జేరు
టెట్లొకో కపు లంచు నించుక మనమునఁ గ్రమ్మఱ శోకంబు గ్రమ్ముకొనియెఁ
గపులయంబుధిపారగమనమం దుత్తర మెద్ది మహీజ తా నేమి పలికెఁ


తే.

జెప్పు మని పల్కి మోహంబు గప్పికొనఁగ
శత్రుసూదనుఁ డగురామచంద్రుఁ డపుడు
వదన మటు వాంచి దైన్యంబు గదుర నూర
కున్న నన్నరపతిశోక ముడుపఁ దలఁచి.

14

సుగ్రీవుఁడు రామున కుత్సాహము కలుగఁజేయుట

వ.

సత్త్వసంపన్నుం డగుసుగ్రీవుం డుద్గ్రీవుం డై యి ట్లనియె.

15


చ.

మనుకులసార్వభౌమ రిపుమర్దనశాలివి నేర్పుపెంపున
న్మనుజనుతప్రతాపమహిమం గడు మేటివి వీర్యసంపద
న్ఘనుఁడవు నీవు ప్రాకృతునికైవడి నేల తపించె దిట్లు చ
య్యనఁ బరితాపము న్విడువు మయ్య కృతఘ్నుఁడు నెయ్యము న్బలెన్.

16


తే.

జనకసుత సేమమున నున్న దనెడువార్త
వినఁబడియె రావణుం డున్నవిధము దెలిసె
విను మిది ప్రమోదకాల మై తనరుఁగాని
లక్ష్మణాగ్రజ దుఃఖకాలంబు గాదు.

17


వ.

మహాత్మా నీ వాగామిగోచరార్థజ్ఞుండ వూహాపోహకుశలుండవు పరిచ్ఛేత్తవర్ధ
తత్త్వజ్ఞుండవు జ్ఞాతాత్మస్వరూపుం డైనయోగి యపవర్గదూషణి యైనబుద్ధిం
బోలెఁ బ్రయోజనహానికరియు నశుభాత్మికయు నైనయీబుద్ధి నవలం ద్రోచి
పుచ్చుము.

18


తే.

అనఘచారిత్ర శోకపర్యాకులుండు
దీనుఁ డుత్సాహహీనుఁడు నైనవాని
యఖిలకార్యంబులు నశించు ననఁగ శుభము
లంద వన నాపదలు పొందు ననఁగ వినమె.

19


చ.

మఱవక చూడు నాకుఁ గలమర్కటవీరులు వీరె వీర లిం
దఱును సమర్థు లిందఱు నుదగ్రబలు ల్భవదర్థమందు ని
ష్ఠురగతి వహ్నిలో నయినఁ జొచ్చెద మంచుఁ దలంచి యున్నవా
రరయఁగ వీరిఁ గన్గొనిన నాజి నవశ్యము గెల్పు దోఁచెడున్.

20


శా.

ఘోరగ్రాహకుళీరమీనకమఠక్రూరోరగం బైనపా
థోరాశిం దరియించి విక్రమసముద్యోగంబున న్లంక నే
పార న్లగ్గలు పట్టి పంక్తిముఖు నుగ్రాజి న్వడిం ద్రుంచి సొం
పార న్జానకిఁ దెచ్చి యిచ్చెదము దేవా చింత నీ కేటికిన్.

21