Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రతతులచేతిలోఁ బడక గ్రమ్మఱఁ బ్రాణముతోడ నెవ్వఁ డ
ద్భుతగతి రాఁ గలండు క్రతుభుగ్గరుడోరగకోటిలోపలన్.

5


క.

బలవీర్యంబులఁ దేజో, విలసద్గమనమున ఘనవివేకంబున న
త్యలఘుగుణంబుల నితనికి, నిలలోపల సాటి సేయ నెవ్వఁడు గలుగున్.

6


వ.

మఱియు నీహనుమంతునిచేత సుగ్రీవునకు సముద్రలంఘనలంకాప్రవేశసీతా
దర్శనరూపభృత్యకార్యంబు సమగ్రంబుగాఁ గృతం బయ్యె ని ట్లుక్తప్రకారంబున
భృత్యకార్యంబు గావించి విక్రమానురూపం బైనయనుక్తవనభంగరాక్షసవధ
లంకాదహనాదికంబును గృతం బయ్యె నని పలికి యారఘువల్లభుండు హనూ
మంతునియుత్తమభృత్యత్వంబు ప్రకటింపం దలంచి యుత్తమమధ్యమాధమ
భృత్యలక్షణంబు తేటపడ వెండియు ని ట్లనియె.

7


చ.

కడువడి దుష్కరం బయినకార్యమునం బతిచే నియుక్తుఁ డై
తడయక దాని మేలగువిధంబునఁ దీర్చెడుభృత్యుఁ డుత్తముం
డుడుగక చెప్పినంత పని యొప్పుగఁ దీర్చెడువాఁడు మధ్యముం
డడలునఁ దీర్పలేనిఘనుఁ డైననరుం డధముం డనంబడున్.

8


తే.

ఇతఁడు నా చెప్పినంత నే ర్పెసఁగ దీర్చి
దాని కధికోదయం బగుదానిఁ జేసెఁ
దలఁప సందియ మేమి యుత్తముఁ డగుటకు
భర్తృభక్తియుఁ దేజంబు పాటి కెక్కె.

9


వ.

అని పలికి సుగ్రీవు నవలోకించి.

10


క.

జానకిసందర్శనమున, జానుగ భరతుండు నేను సౌమిత్రియుఁ బ్ర
జ్ఞానిధి శత్రుఘ్నుండును, మానుగ బ్రతికితిమి గాదె మారుతికరుణన్.

11


చ.

ముదము దలిర్ప నిట్టిప్రియముం దగఁ జెప్పినయీగుణాబ్ధికి
న్సదృశము గాఁగ సత్ప్రియము సల్పుట కేమియుఁ గానఁ బ్రీతితో
నిదె గొను మింతకంటెఁ బ్రియ మిప్పటి కెద్దియు లే దటంచు నే
సదమలబుద్ధి నిచ్చెద విశాలభుజాపరిరంభణం బొగిన్.

12

రాముఁడు సముద్రతరణమును గుఱించి చింతించుట

వ.

అని పల్కి యక్కకుత్స్థతిలకుండు సకలలోకరక్షాకరంబులును నాశ్రితజన
శ్రీకరంబులును మునిజనవశీకరంబులును రిపులోకభీకరంబులు నగుకరంబులు
నాఁచి ప్రీతిపులకితగాత్రుం డై కృతకార్యుం డై చనుదెంచిన పవననందనుని
గాఢంబుగాఁ బరిరంభించి సుగ్రీవుండు వినుచుండ వెండియు నతని వీక్షించి
సర్వవానరవాహినీసహితుండ నై యే నెట్లు జలనిధిం గడతునని చింతించి
యి ట్లనియె.

13