Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కడు రయమునఁ గాకము వెం, బడిఁ బడి దఱుమంగ భీతిఁ బఱచి యది సురేం
ద్రుఁడు మొదలగు నమరవరుల, యడుగులఁ బడి వారిచేతఁ ద్యక్తంబగుచున్.

1503


క.

జగములు మూఁడును గ్రుమ్మరి, ఖగము పరిత్రాత నెందు గానక వెసఁ దా
మగుడి చనుదెంచి భయమున, జగన్నుతుఁడ వైననిన్ను శరణము నొందెన్.

1504


వ.

ఇట్లు శరణాగతం బైనబలిభోజనంబు నిరీక్షించి యది వధార్హంబైనను శరణా
గతరక్షణంబు మీకుఁ బ్రధానగుణంబు గావున దానిఁ గృపార్ద్రవిలోకనం
బుల నవలోకించి మదీయాస్త్రంబు మోఘంబు సేయుట కశక్యంబు నీదక్షిణ
నేత్రం బొసంగి ప్రాణంబులు రక్షించుకొని యథేచ్ఛం జను మని మీ రాన
తిచ్చిన నక్కాకం బట్లు గావించి మీకును దశరథునకును నమస్కారంబు గావించి
యనుజ్ఞ గొని నిజనివాసంబునకుం జనియె నని యీయభిజ్ఞానంబు మీ కెఱిం
గింపు మని పలికి వెండియు నద్దేవి యి ట్లనియె.

1505


సీ.

ప్రాణేశ నీ విట్టి యస్త్రవిదుండవు సత్త్వవంతుఁడ వాజి సాహసుఁడవు
శీలవంతుండవు శిష్టసమ్మతుఁడవు దానవులందు నీ దారుణాస్త్ర
మేల ప్రయోగింప కి ట్లుపేక్షించితి వమరవిద్యాధరయక్షసిద్ధ
గరుడగంధర్వకిన్నరచారణులలోన నని నిన్నుఁ దాఁకి పోరాడఁ జాలి


ఆ.

నట్టివీరుఁ డొక్కఁ డైన లేఁ డధిప నా, మీఁద నీకుఁ బ్రేమ మిక్కుటముగఁ
గలదయేని గలనఁ గలుషాత్ముఁ డైనరా, వణునిఁ దునిమి నన్నుఁ బడయు మింక.

1506


క.

ఘనుఁ డగులక్ష్మణుఁ డయినను, దనయన్నకుఁ బ్రియము గాఁగ దశకంఠు ననిన్
సునిశితశరములఁ బొరిగొని, ననుఁ బ్రోవ కుపేక్షఁ జేసినాఁ డేమిటికిన్.

1507


తే.

అరయ దివ్యాస్త్రకోవిదు లయ్యు వాయు, వహ్నిసమతేజు లయ్యు దుర్వారశౌర్యు
లయ్యు రాఘవు లేల దశాస్యుఁ దునిమి, నన్నుఁ బ్రోవ కుపేక్షించియున్నవారు.

1508


తే.

అరయ మద్దుష్కృతంబు కొండంతగలదు, సంశయము లేదు గానిచో శక్తు లయ్యు
సహితు లయ్యును రామలక్ష్మణులు నన్ను, విడిచి యొప్పరికింతురె ప్రియము మఱచి.

1509


వ.

అని వగపు దోఁపఁ బలికి కన్నీరు నించిన నద్దేవి ననూనయించుచు నే ని ట్లంటి.

1510

హనుమంతుఁడు రామునకుఁ దాను సీత నాశ్వాసించిన ప్రకారము దెల్పుట

శా.

శూరుం డైనరఘుప్రవీరుఁడు భవచ్ఛోకంబుచే వన్య మా
హారంబు గొన కన్యకార్యవిముఖుం డై యున్నవాఁ డామహో
దారుం గన్గొని లక్ష్మణుండును బరిత్రస్తాత్ముఁ డై సంతతం
బారీతి న్విలపించుచుండు నిజ మీయర్థంబు సాధ్వీమణీ.

1511


క.

చిరకాల మయ్యె నెపు డీ, చెఱఁ బాసెదనో యటంచుఁ జింతింపకు మీ
దురవస్థ కిపుడె యంతము, పరికించెద వింక దుఃఖపడకుము తల్లీ.

1512


తే.

ఆవరోత్తము లిరువురు మానితముగ, నిన్ను వీక్షింపఁగాఁ గోరి యున్నవారు
నిశితశరముల లంకను నీఱుఁజేయఁ, గలరు నిక్కము శోకంబు వలవ దబల.

1513