| చ. |
నరవర నీదుశాసనమునం బనిఁబూని యగస్త్యదిక్తటం
బరయుచు నేగి వింధ్యనగ మల్లన దాఁటి సమస్తశక్తి నే
నరుదుగ నూఱుయోజనము లంబుధి వేగ పతిక్రమించి దు
స్తర మగునమ్మహాజలధిదక్షిణతీరముఁ జేరి యచ్చటన్.
| 1462
|
హనుమంతుఁడు రామునకు సీత యున్నచందమును దనతో నన్నవిధంబును జెప్పుట
| తే. |
అద్రితటముల వనముల నమ్మహీజ, చొప్పు వెదకుచుఁ బోవ నచ్చోట నొక్క
కొండపయి మిన్ను ముట్టి యాఖండలునిపు, రంబు గ్రేడించు నొకనగరంబు గంటి.
| 1463
|
| క. |
ఆవీడు వినుము లంక య, నా విశ్రుతిఁ గాంచు దానినాథుఁ డఖిలర
క్షోవిభుఁడు దుష్టచిత్తుఁడు, రావణుఁ డన నొకఁడు గలఁడు రాజుకులేశా.
| 1464
|
| తే. |
ఆపురము సొచ్చి యేను దశాన్యు నంతి, పురము చెంగటఁ బొల్చు విస్ఫురదశోక
వనములో నున్న యొక్కసువర్ణపత్ర, పుష్పమయశింశుపాతరుమూలమందు.
| 1465
|
| సీ. |
అనశనవ్రతసంభవాయాసభరమున నడలి నెమ్మేనుకార్శ్యము వహింప
నెడలేనిచెమటచిత్తడిఁ దోఁగి చీరధూలీపరివ్యాప్తి మాలిన్య మొంద
నిగిడించు నిట్టూర్పు సెగలచేఁ గందినవదనాంబుజమున వైవర్ణ్య మొదవఁ
ద్వద్వియోగజదుఃఖతాపరోదనమునఁ గెరలి నేత్రముల రక్తిమ చెలంగ
|
|
| తే. |
మాటిమాటికి రామరామా యటంచుఁ
గనుల నశ్రులు నించుచుఁ గఠినభూమి
శయ్యపై మేను వైచి తుషారసమయ
నళినికైవడి నున్నజానకిని గంటి.
| 1466
|
| ఉ. |
తక్కక తన్ను దైత్యవనితల్ పరుషోక్తులఁ దూల నాడఁగా
నుక్కఱి యాప్తబాంధవుని నొక్కనిఁ గానక కంపితాంగి యై
యక్కట నన్ను నాపదల కగ్గము చేసెనె దైవ మంచుఁ దాఁ
జెక్కిటఁ జెయ్యి జేర్చి బలుచింతలఁ గుందెడుదాని వెండియున్.
| 1468
|
| చ. |
బలితపురక్కసుండు తనుఁ బల్కిన యక్కొఱగానివాక్యముల్
తలఁచి తలంచి చిత్తమునఁ దద్దయు నెవ్వగ గూర రాము న
త్యలఘునిఁ బాసి యొంటి నకటా మన నేటి కటంచుఁ దెంపునన్
సొలయుచు మేనుఁ బాతు ననుచున్ దలపోసెడుదాని జానకిన్.
| 1469
|
| క. |
పరికించి యేను మెల్లన, వెఱచుచు నిక్ష్వాకువంశవిఖ్యాతిని గ
ర్ణరసాయన మగునట్లుగ, వరమతి నొకకొంతసేపు వర్ణించి తగన్.
| 1470
|
| వ. |
అద్దేవికి విశ్వాసంబు పుట్టఁ జేసి సముచితంబుగాఁ బొడసూపి.
| 1471
|