| |
బైనలాంగూలంబు ద్రిప్పుచుఁ బరమానందంబున నుండెఁ బదంపడి జాంబవ
త్ప్రముఖహరిశ్రేష్ఠు లంగదాంజనేయులం బురస్కరించుకొని రామదర్శనకాం
క్షులై సంతోషవిశేషంబునం బొదలుచు గగనంబున నుండి ఋశ్యమూకంబు
నకు డిగ్గి రామసుగ్రీవులసన్నిధిం బొడసూపి రప్పుడు హనుమంతుండు రాముని
చరణంబులు శిరంబు సోఁకం బ్రణమిల్లి బద్ధాంజలిపుటుండై.
| 1455
|
హనుమంతుఁడు సీతం జూచితి నని రామునకుఁ జెప్పుట
| చ. |
జనపతి రాముఁడుం దదనుజన్ముఁడు భానుసుతుండు ప్రీతి సొం
పెనయఁగ సీతవార్త విన నెంతయుఁ గౌతుకముం బ్రియంబు నె
మ్మనమునఁ బర్వఁ దన్ను బహుమానపురస్సరదృష్టిఁ జూడ నే
ర్పునఁ గనుఁగొంటి సీత నని పొల్పుగఁ దెల్పె సుధామయంబుగన్.
| 1456
|
| తే. |
అపుడు సౌమిత్రి సమ్మోదితాంతరంగుఁ
డగుచు నప్పవనాత్మజునందు నిశ్చి
తార్థుఁ డగుభానుసుతునివాక్యమున కలరి
యింపు దళుకొత్త బహుమానదృష్టిఁ గనియె.
| 1457
|
| క. |
పరమప్రీతియుతుం డై, పరవీరఘ్నుండు రామభద్రుఁడు కరుణా
పరికలితకటాక్షంబులఁ, బరికించి బహూకరించెఁ బవనతనూజున్.
| 1458
|
| వ. |
అంత వానరులందఱుఁ జిత్రకాననశోభితం బైనఋశ్యమూకంబు నధిగమించి
యువరాజపురస్సరంబుగాఁ గౌసల్యానందనుపదారవిందంబులకు వందనంబుఁ
జేసి సౌమిత్రిచరణంబులు ఫాలంబు సోఁకం బ్రణతు లై సుగ్రీవునకు నమస్క
రించి వినయవినమితగాత్రులై సంతసంబున.
| 1459
|
| సీ. |
అవనిజ దశకంథరాంతఃపురోచితవనములో నునికియు దనుజయువతు
లుద్వృత్తిమెయిఁ దర్జనోక్తు లాడుటయును రామునిపయి ననురాగ మర్థిఁ
దాల్చుటయును సమస్తంబును వినిపించి సమయకాలము కడసనుట కాత్మ
నలుగక మన్నింపుఁ డని నళీముఖు లెల్ల వేఁడిన జానకీవిభుఁడు మోద
|
|
| తే. |
మంది వారలతోడ ని ట్లనియె సీత
యెచట నున్నది యె ట్లున్న దేమి యన్న
దెలమి నాయందు వర్తించు టెత్తెఱంగు
తెల్లముగ నింతయును మాకుఁ దెలుపుఁ డిపుడు.
| 1460
|
| వ. |
అని పలికిన రామనిగదితం బైనవచనంబు విని వానరు లందఱు సీతావృత్తాంత
కోవిదుం డగుహనుమంతుని నియోగించిన నాహరిశ్రేష్ఠుండు పరమానందపుల
కితగాత్రుం డై భక్తితాత్పర్యంబున సీత యున్నదిక్కునకుం బ్రణమిల్లి రామున
కభిముఖుం డై కేలు మోడ్చి ఫాలంబునం జేర్చి వినయంబున ని ట్లనియె.
| 1461
|