Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కడునిక్కువంబుగాఁ గ్రాఁగి యుండఁగఁ బోలు నెంత దురాత్ముఁడ నెంత జడుఁడ
నెంత దుర్మేధుఁడ నెంత మూర్ఖుఁడ నెంత పాపస్వభావుఁడఁ బతిహితంబు


తే.

దీర్పలేనైతి స్వామిఘాతిమతి నైతిఁ
బూని వచ్చినకార్యంబు పొందుపఱచు
కొనుట గద యుక్త మెందు నప్పనియె చెఱచి
కొనెడు నాయట్టికష్టదుర్జనుఁడు గలఁడె.

1221


ఆ.

అరయ లంకయందు నగ్నిచే భస్మంబు, గానిదేశ మొక్క టైన లేదు
సీత వహ్నిశిఖలఁ జిక్కక మని యున్న, దంచు నిశ్చయింప నగునె యింక.

1222


క.

కుపితాత్ముఁడ నై ప్రజ్ఞా, విపర్యయంబున నొకింత వెఱవక మనుజా
ధిపు కర్యముఁ జెఱచితి నిఁకఁ, గపు లందఱు నన్ను స్వామిఘాతుకుఁ డనరే.

1223


వ.

మఱియు నన్వేషణపూర్వకరావణనిలయపరిజ్ఞానసీతాదర్శనసన్నివేదనరూప
మహాకార్యంబు రామనివేదనమాత్రావశిష్టం బగునట్లు గావింపఁబడియెఁ గా
వున నిప్పుడు క్రోధాభిభూతుండ నైననాచేతఁ దత్కార్యమూలక్షయంబు నిస్సం
శయంబుగాఁ గావింపంబడియె రోషంబువలన దోషంబుఁ జేసితి నింక నేమ
నిన నేమియగు ముల్లోకంబులయందు మదీయం బైనకపిత్వంబు ప్రథితంబయ్యె
రక్షణసమర్థుండ నైననాచేత నాగ్రహంబువలన జానకి రక్షింపంబడకుండుటం
జేసి స్వతంత్రంబు ననవస్థితంబు నగురజోగుణనిబంధనచేష్టావిశేషంబును గర్హిం
చెద రావణుండు సీతం జంపక మ్రుచ్చిలించికొని పోయె నే నద్దేవి నజ్ఞానంబునం
జంపితి రామునకు నాకంటె రావణుండె యొక్కింత మేలువాఁ డయ్యె నింక
నెత్తెఱంగున హరీశ్వరుఁ డగుసుగ్రీవుని సందర్శింపంబోదు నరేశ్వరు లగురామ
లక్ష్మణులతో నేమని సంభాషింపుదు నకృతార్థుండనై యమ్మహాత్ములసమ్ముఖం
బునకుం జనుకంటె నా కిచ్చట జలంబులంబడి యైనఁ జిచ్చులో నుఱినయైనఁ
బాశంబులచే నుఱిగొని యైనవిషంబు గ్రోలియైన సముద్రచరంబు లగుమహాస
త్వంబులకు మదీయశరీరమాంసఖండంబులు సమర్పించియైనఁ బ్రాణత్యాగంబు
సేయు టధికోదయంబై తోఁచుచున్నది యచ్చటికిం బోయిన సీతావృత్తాంతంబు
విని రామలక్ష్మణులు నిక్కంబుగా శరీరత్యాగంబు సేయుదురు తద్వినాశంబుఁ
జూచి సుగ్రీవుండు బంధుసహితంబుగా నశించు నంతఁ దద్వృత్తాంతంబు విని
భ్రాతృవత్సలుం డగుభరతుండు శత్రుఘ్నసహితంబుగా మరణంబు నొందు ధర్మి
ష్టం బగునిక్ష్వాకుకులంబు దీఱినపిదప సమస్తజనంబులు శోకసంతాపపీడితులై
యంతంబు నొందెదరు భాగ్యరహితుండ లుప్తధర్మార్థసంగ్రహుండ రోషదోష
పరీతాత్ముండ నగునే నింతకుం గారణంబ నైతి నని యనేకప్రకారంబుల
దీనుండై చింతించుచుండ నప్పు డయ్యనిలనందనునకు వైదేహి కుశలంబు
దెల్పుచుఁ గొన్నిశుభనిమిత్తంబులు దోఁచిన వెండియుఁ దనమనంబున.

1224