Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

గుచు బలుమానిసి చీమలం జమరుతెఱంగున నక్షప్రయుక్తశరపరంపరలఁ గాలం
గేల నులిమి వైచి నభోభాగంబు నిండ సింహనాదంబుఁ జేసి వైనతేయుం
డుం బోలె నతిజవంబున వాయునిషేవితం బగుగగనంబున కెగసి భిన్నభుజాం
తరుండును భుజోరువిక్షేపణఘోరదర్శనుండును బ్రచండవిక్రముండును మహా
హవోల్లాసభాసురుండును నైనయక్షునిపరాక్రమంబును జాపవిద్యాపాండిత్యం
బునుం జూచి బహుమానపురస్సరంబుగా మెచ్చుచుఁ బవమానసూనుండు తన
మనంబున.

⁠ 1082

అక్షునిపరాక్రమంబునకు హనుమంతుఁడు మెచ్చుకొనుట

ఉ.⁠

వీనిభుజావిజృంభణము వీనిసమున్నతశౌర్యసంపదల్
వీనిశరాసనైపుణము వీనిమహాద్భుతజన్యకర్మమున్
దానవసిద్ధసాధ్యసురదైత్యమహోరగులందు నెందునుం
గానము చూచినంత బలఘస్మరుఁ డైన నుతింప వల్వదే.

⁠ 1083


చ.⁠

ఇతఁ డతిబాలుఁ డయ్యుఁ దగ నెంతయుఁ బ్రౌఢునియట్లు బాలసూ
ర్యతులితతేజుఁడై దొడరి యద్భుతభంగి రణం బొనర్చెడున్
వితతబలోన్నతుం డయినవీని వధించెడునంత తెంపు నా
మదికి జనింప దిప్పు డసమానపరాక్రముఁ డీతఁ డెన్నఁగన్.

⁠ 1084


సీ.⁠

విక్రమోత్సాహవివృద్ధప్రతాపుఁ డై గురుశక్తి నాలావు సరకుగొనక
మధ్యందినాదిత్యుమాడ్కి వెలుంగుచు మదికి నివ్వెఱపాటు నొదవఁజేయు
చున్నాఁడు భుజసత్త్వ మొగి నంతకంతకు నగ్గలం బగుచున్న దగ్నియట్లు
కదువడి లోకంబు గొల్ప నోపెడువాఁడు తడవు సేయుట యింకఁ దగవు గాదు

⁠


తే.⁠

అండజాధిపుక్రియ వీర్య మాశ్రయించి, వీని వధియించి పుచ్చెద వేగ కాలు
పురికి నని నిశ్చయించి వానరవరుండు, చండభుజవీర్యసాహసోద్దండుఁ డగుచు.

⁠ 1085


చ.⁠

తరుచుగ వృష్టిధారలకుఁ దాల్మి వహించి దలంకనట్టిసుం
ధరమృగరాజులీల క్షణదాచరశేఖరచాపవిచ్యుతా
త్యురుతరబాణవర్షమున కోర్చి రయంబున వానితేరిపై
కుఱికి వినిగ్రహగ్రహసమున్నతభూరిభుజావలేపుఁ డై.

⁠ 1086


చ.⁠

అడరి మనోజవంబు లగునశ్వములం బరిమార్చి సారథిం
దడయక చంపి కేతనము దన్ని పతాక ధరిత్రిఁ గూల్చి యె
క్కుడువడితో రథాంగయుగకూబరము ల్వివిధాయుధంబులుం
బొడిపొడి చేసి వి ల్విఱిచి భూషణపంక్తులు రాల్చె నుగ్రతన్.

⁠ 1087


వ.⁠

ఇట్లు మగున్నందనపాణితలప్రహారంబున రథంబు భగ్నంబై కూలినఁ దత్క్షణంబ
యక్షుం డారథంబు విడిచి కార్ముకఖడ్గంబులు గొని తపోభియోగంబున
దేహంబు విడిచి స్వర్గంబునకుం జనుమహర్షిపోలికి నంబరంబున కెగసి వివిధ
భంగులం జరించుచున్న నలిగి హనుమంతుండు.

⁠ 1088