Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూరిసుమద్యుతితో నల, రారెడు నదె కర్ణికారయష్టిని గంటే.

74


క.

అతులితబహుధాతుసమ, న్విత మగునీధరము వాయువేగాతిశ యో
త్థిత మగువిచిత్రరజమును, జితవిమతాసాంద్రముగ సృజించెడుఁ గంటే.

75


క.

సురుచిరపుష్పితనిష్ప, త్రరమ్యకింశుకతరుప్రతానంబుల నీ
గిరిసానువు లొప్పారెడుఁ, గర ముజ్జ్వలితంబు లైనకైవడిఁ గంటే.

76


వ.

మఱియుఁ బంపాతీరసముద్భూతమాలతీమల్లికాకరవీరకేతకీసింధువారవాసంతి
కామాధవీకుందగుల్మచిరిబిల్వమధూకవకుళవంజుళచంపకతిలకనాగవృక్షనీపవర
ణఖర్జూరపద్మకనీలాశోకలోధ్రాంకోలకురంటకపూర్ణకపారిభద్రకచూతపాటల
కోవిదారముచుళిందార్జునకేతకోద్దాలకశిరీషశింశుపాధవశాల్మలీకింశుకకురవక
తిమిశనక్తమాలచందనస్పందనప్రముఖనిఖిలతరులతాప్రతానంబులు పుష్పితా
గ్రంబులై గంధవంతంబులై మనోహరంబులై నానావర్ణంబులై మహోన్నతంబు
లై చూపట్టుచున్నవి విలోకింపుము.

77


క.

అనిలచలితవిటపము లగు, ఘనతరసన్నిహితవృక్షగణములను గరం
బనువర్తించుచు నున్నవి, మునుకొని లత లబ్జముఖులు పురుషులఁ బోలెన్.

78


తే.

ప్రతివనంబును బ్రతిపాదపంబు ప్రతిన
గంబు తిరుగుచుఁ బవనుండు కర మనేక
మధురసాస్వాదుఁ డగుటఁ బ్రమదము నొంది
యున్నచందాన నిటు వీచుచున్నవాఁడు.

79


వ.

మఱియుఁ గొన్నితరువు లీషద్వికసితకుసుమంబులై కొన్నిపాదపంబులు ముకుళ
సంవీతంబులై వృంతపర్ణబాహుళ్యంబున శ్యామంబులై ప్రకాశించుచున్నవి
విలోకింపుము.

80


మ.

అదె చంచన్మకరందలుబ్ధమధుపం బత్యంతరాగంబుతో
నిది మృష్టం బిది వాసితం బిది మహాహృద్యం బటంచున్ రసా
స్పదపుష్పంబులమీఁద నుండి పరపుష్పశ్రేణిపై వ్రాలుచు
న్నది యీముంగలివృక్షమండములలోనం గంటె వీరోత్తమా.

81


వ.

మఱియు నిచ్చట వసుంధర తమయంతం దాము రాలి పడిన నానావిధరుచిర
కుసుమసంఘాతపరిస్తీర్ణయై శయనాస్తరణపరిస్తీర్ణ యైనదానియట్ల సుఖావహాకృ
తియై యొప్పుచున్నది యిచ్చటిగిరిసానువులందు విశీర్ణంబులైన వివిధపుష్పంబుల
చేత నభిసంవృతంబులై వివిధప్రసరంబులు పీతరక్తంబులుగా రచియింపంబడిన
వానిచందంబునఁ జూపట్టుచున్నయవి హిమాంతంబునందలివృక్షంబులకుసుమ
సంభవంబు వీక్షింపుము పుష్పమాసంబునందుఁ బరస్పరస్పర్ధవలనం దరువులు
పుష్పితంబు లైనవానిమాడ్కి నుత్ప్రేక్షింపం దగియున్నవి మఱియుఁ గుసు
మోత్తంసవిటపంబు లగుమఱికొన్నిపాదపంబులు భ్రమరనాదమిషంబున నొం
డొంటిం జీరుచున్నవానియట్ల యలరుచున్న వదియునుం గాక.

82